నలుగురితో నారాయణ.. కోరిక కోరారు.. స్వామీజీ వరం ఇచ్చారు

Update: 2021-03-04 04:05 GMT
కమ్యునిస్టులకు స్వామీజీలకు అస్సలు పొసగదు. ఆ మాటకు వస్తే.. కమ్యునిస్టునేతలకు హిందూ దేవుళ్లు.. హిందూ కల్చర్ లాంటివి బూతుగా కనిపిస్తుంటాయి. మిగిలిన మతాల గురించి నోరెత్తే సాహసం చేయని వారు.. తరచూ హిందువుల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. గుళ్లకు వెళ్లటానికే ఇష్టపడని కామ్రేడ్స్.. ఇక స్వామీజీల వద్దకు వెళతారా? ఇదంతా ఒక ఎత్తు అయితే.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. నలుగురితో నారాయణ అన్న బిరుదును తన సొంతం చేసుకుంటున్నారు.

ఇటీవల కాలంలో ఎంత మాట్లాడినా.. మీడియాలో ఆయన ముఖం లేవనగతంలో మాదిరి ప్రముఖంగా కనిపించని పరిస్థితి. ఇలాంటివేళ.. రోటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తే ప్రయోజనం ఉంటుందని భావించారో ఏమో కానీ.. ఆయన చేసిన పని ఇప్పుడు షాక్ తినేలా చేస్తుంది. ఇక..వామపక్షవాదులైతే నోళ్లు నొక్కుకునే పరిస్థితి. కమ్యునిస్టుల పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు. ఇంతకూ ఆయనేం చేశారన్నది చూస్తే.. ఏపీలో జరుగుతున్న పురపోరులో భాగంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు నారాయణ.

ఇందులో భాగంగా విశాఖ నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో 97వ వార్డులో సీపీఐ అభ్యర్థిగా యశోద పోటీ చేస్తున్నారు. దీంతో.. ఆమె తరఫున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు నారాయణ. వార్డు ప్రచారంలో భాగంగా వార్డు పరిధిలోని స్వరూపానందస్వామి మఠం ఉంది. దీంతో.. ఆయన్ను కలిసిన నారాయణ.. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

ప్రచారంలో భాగంగా ఆశ్రమానికి వెళ్లామని.. ఆయన ఆశీస్సులు తీసుకున్న వారంతా గెలుస్తారనే నమ్మకం ఉందని.. అందుకే ఆయన ఆశీస్సులు కోసం స్వామిని అభ్యర్థించినట్లు నారాయణ పేర్కొన్నారు. కామ్రేడ్ నారాయణ కోరిన వరాన్ని ఆయన ఎలా స్పందించారన్న విషయాన్ని చెప్పని నారాయణ.. ఆశ్రమానికి వెళ్లే విషయంలో తనకు ఎలాంటి రాజకీయ ఎజెండా  లేవని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే.. స్వామీజీని నారాయణ కలిసిన వైనం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావటం.. ఆయన తీరును పలువురు తప్పు పట్టటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చివరకు కామ్రేడ్ నారాయణ సైతం నలుగురిలో నారాయణ అయ్యారుగా!
Tags:    

Similar News