ట్రంప్‌ ఏం చేయాలో చెప్తున్న మ‌న ఎర్రన్న‌

Update: 2017-03-18 05:03 GMT
ఒకింత గ్యాప్ త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ త‌న‌దైన శైలిలో కామెంట్లు చేశారు. రాష్ట్రం నుంచి మొద‌లుకొని జాతీయ‌-అంత‌ర్జాతీయ స్థాయి వ‌ర‌కు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఆయ‌న స్పందించారు. అమెరికాలోని భారతీయులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికైనా స్పందించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తో చర్చించాలని  డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల క్రితం ఉద్యోగాలు - వ్యాపారాల కోసం అమెరికా వెళ్లి స్థిరపడిన వివిధ దేశస్తులపై దాడులు చేయటం దారుణమన్నారు. ఈ విష‌యంలో ట్రంప్ సైతం విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా కాకుండా బాధ్య‌త‌గ‌ల ప్ర‌భుత్వ అధినేత‌గా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడుకు వైసీపీ ఎమ్మెల్యే రోజా కాళికాదేవిలా కనిపిస్తోందని, ఆమెను చూస్తేనే బాబు వణికిపోతున్నారని నారాయ‌ణ ఎద్దేవా చేశారు. తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అకార‌ణంగా టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌ రెడ్డి - వీరయ్యను సస్పెండ్ చేశారని నారాయ‌ణ ఆరోపించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్ల కోసం కుల - మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొట్టిందని నారాయణ విమర్శించారు. ప్రధాని మోడీ పార్లమెంట్‌ హాల్‌ లోకి ప్రవేశించగానే బీజేపీ సభ్యులు జైశ్రీరామ్‌ అని నినాదం చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. గోవా-మణిపూర్‌ రాష్ట్రాల్లో గవర్నర్లను ఉపయోగించి అడ్డదారిలో అధికారం చేపట్టారని ఆరోపించారు. ప్రొఫెసర్‌ సాయిబాబును దేశద్రోహం పేరుతో తప్చుచేయకుండానే పదేళ్ల జైలు శిక్ష విధించారని నారాయ‌ణ‌ విమర్శించారు. రోహిత్‌, ముత్తుకృష్ణన్‌ ఆత్మహత్యల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోహిత్‌ చట్టాన్ని తేవాలని, విద్యాసంస్థల్లో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే దాని దృష్టికి సమస్యలు తెచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలను గంగలో కలిపేందుకు వామపక్షాలు కలిసి ఉద్యమిస్తాయని, ఇందుకోసం బెంగుళూరు సమావేశాల్లో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని నారాయ‌ణ‌ వెల్లడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News