కేసీఆర్‌ కు ఫోన్ ట్యాపింగ్ ను గుర్తు చేసిన నారాయ‌ణ‌

Update: 2018-05-10 06:53 GMT
కార‌ణం ఏదైనా.. అనుకోనిరీతిలో.. అనుకోని విధంగా మూడేళ్ల కింద‌ట సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసును తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా రివ్యూ చేయ‌టం తెలిసిందే. ఈ విష‌యాన్ని గుట్టుగా ఉంచేందుకు బోలెడ‌న్ని అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యాల‌యం మాత్రం దీన్నో ప్రెస్ నోట్ గా రిలీజ్ చేసింది. ముఖ్య‌మంత్రి కార్యాల‌య‌మే స్వ‌యంగా ప్రెస్ నోట్ రూపంలో పొరుగు రాష్ట్ర సీఎంను ఇబ్బంది పెట్టే నిర్ణ‌యం తీసుకోనున్న విష‌యాన్ని ప‌రోక్షంగా చెప్ప‌టంతో ఒక్క‌సారిగా రాజ‌కీయం వేడెక్కింది.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో వివిధ రాష్ట్రాల‌కు చెందిన అధినేత‌లు.. వారి కుమారుల‌తో భేటీ  అవుతున్న వేళ‌.. అందుకు భిన్నంగా మూడేళ్ల క్రితం నాటి ఓటుకు నోటు కేసును తెర మీద‌కు తీసుకొచ్చేలా కేసీఆర్ చేసిన ప‌నిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదంతా తెర వెనుక ప్ర‌ధాని మోడీ తిప్పిన చ‌క్ర‌మేనంటూ కేసీఆర్ తీరును త‌ప్పు ప‌ట్టే వారు లేక‌పోలేదు.

ఇదిలా ఉంటే.. కేసీఆర్ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. ఆయ‌న ఉలిక్కిప‌డేలా వ్యాఖ్య‌లు చేశారు సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ‌. తాజాగా వ‌రంగ‌ల్ లోని పోచ‌మ్మ మైదాన్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలోపాల్గొన్న ఆయ‌న‌.. ప్ర‌ధాని మోడీ త‌న‌కు అనుకూలంగా ఉన్న అవినీతిప‌రుల్ని ర‌క్షిస్తున్నార‌ని.. వ్య‌తిరేకంగా ఉన్న వారిని భ‌య‌పెట్టి త‌న దారికి తెచ్చుకోవాల‌ని చూస్తున్న‌ట్లుగా ఆరోపించారు.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులైన కేసీఆర్‌.. చంద్ర‌బాబులు ఫోన్ ట్యాపింగ్‌.. ఓటుకు నోటు కేసుల్ని ఎలా ఎదుర్కోవాలంటూ మీటింగ్ లు పెట్టుకొని మ‌రీ ఆలోచిస్తున్న‌ట్లుగా చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ లు ఉన్నార‌ని.. ఓటుకు నోటు కంటే కూడా టెలిఫోన్ ట్యాపింగ్ కేసే పెద్ద‌ద‌ని గుర్తు చేశారు. ప్ర‌ధానికి ధైర్యం ఉంటే.. చంద్ర‌బాబు.. కేసీఆర్ ల‌ను జైలుకు పంపుతారా? అంటూ ప్ర‌శ్నించారు. చూస్తుంటే.. ఓటుకు నోటు కేసును తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు స‌మీక్షిస్తే.. నారాయ‌ణ మాట‌ల్ని చూస్తే.. ఫోన్ ట్యాపింగ్ కేసును ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌మీక్షించాల‌ని చెప్పాల‌నుకుంటున్నారా?  అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. మ‌రి.. నారాయ‌ణ శ్లేష‌ను ఇద్ద‌రు చంద్రుళ్లు ఎలా అర్థం చేసుకుంటారో?
Tags:    

Similar News