సిపీఐ సిద్ధాంతం...కూటమితో రాద్దాంతం...!

Update: 2018-11-20 05:12 GMT
భారత కమ్యూనిస్టు పార్టీ. భారత రాజకీయ పరిభాషలో సిపీఐ. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలను....కాదు కాదు... కామ్రెడ్ లను కలిగి ఉన్న పార్టీ. దేశంలో ఎక్కడా అధికారంలోకి రాకపోయనా... తమ కంటూ ఉనికిని - ఓ గుర్తింపును తెచ్చుకున్న పార్టీ. అంతే కాదు ఓట్లంటే వేయరేమో కాని భారత కమ్యూనిస్టు పార్టీ అంటే ఓ నిబద్ధత కలిగిన పార్టీగా గుర్తింపు ఉంది. ఈ గుర్తింపుతోనే ఈ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకపోయినా మనగడ సాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సిపీఐ పార్టీకి అంతో ఇంతో బలం... బలగం ఉంది. అంతే కాదు ఈ పార్టీ సిద్ధాంతాలను ఆకర్షితులైన వారు ఇంకా ఉన్నారు. బడుగు బలహీన వర్గాల్లో సిపీఐకి కొంత ఆదరణ ఉంది. ఇదే ఆ పార్టీని ఇంకా తెలుగు ప్రజలు మరచిపోకుండా చేస్తోంది.

ఇంతకీ అసలు విషయానికి వస్తే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అధికారమే పరమావధిగా ఒక్కటైన తెలుగుదేశం - కాంగ్రెస్ - తెలంగాణ జన సమతితో కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ కూడా చేతులు కలిపింది. ఎన్నికల్లో విజయం సాధించాలంటే త్యాగాలకు సిద్ధం కావాలన్న కాంగ్రెస్ పార్టీ ఆ పనిని సిపీఐకే అప్పగించింది. పొత్తులో భాగంగా సిపీఐకి దక్కిన స్ధానాలు కేవలం మూడంటే మూడే. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ పోటీ అంటూ లింకులు కూడా పెడుతోంది. సిద్ధాంతానికి మారు పేరైన భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు - కార్యకర్తలు మహాకూటమి కారణంగా తమ సిద్ధాంతానికి తిలోదకాలు ఇచ్చినట్లు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో గత అనుభవాల దృష్ట్యా  ఈసారి కూడా దెబ్బ తిన్నామని - ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే మరిన్ని దెబ్బలు తగులుతాయేమోనని భయం సిపీఐ నాయకులను వేధిస్తోంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంశంలో తమను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ కూడా భవిష్యత్ లో ఎలాంటి ఇరుకున పెడుతుందోననే భయం వారిలో వ్యక్తం అవుతోంది. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించాలన్న లక్ష్యం మంచిదే అయినా మహాకూటమిలో ఎదురవుతున్న అవమానాలు మాత్రం తట్టుకునేలా లేవనే ఆవేదన సిపీఐ నాయకులు - కార్యకర్తల్లో కనిపిస్తోంది. ఇంత సిద్ధాంతం.... అనుభవం... ప్రజల్లో సానుభూతి ఉన్నా మహాకూటమితో తమ పార్టీ పరిస్ధితి కూరలో కరివేపాకులా మారిందనే ఆవేదన కామ్రేడ్లను వేధిస్తోంది.

Tags:    

Similar News