యుద్ధనీతిని కూడా బాబు పాటించ‌డం లేద‌ట‌

Update: 2016-10-29 07:19 GMT
పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కుకు వ్య‌తిరేకంగా చేస్తున్న ఆందోళ‌న రూపుమారుతోంది. ఇక్క‌డ పార్క్ నిర్మించ‌వ‌ద్దంటూ ఇప్ప‌టికే స్థానికులు ఆందోళ‌న చేస్తుండ‌గా వైసీపీ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - వామ‌ప‌క్షాలు - వివిధ ప్ర‌జాసంఘాలు మ‌ద్ద‌తిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు కొత్త త‌ర‌హాలో ఉద్య‌మించారు. సీపీఎం - గొంతేరు పరిరక్షణ సమితి - ఆక్వా ఫుడ్‌ పార్కు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన 'ప్రజాభేరి పాదయాత్ర'లో ఐదోరోజు తన కుటుంబ సమేతంగా మ‌ధు పాల్గొని పాద‌యాత్ర నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్రజాచైతన్య సభల్లో మధు ప్రసంగిస్తూ ఫ్యాక్ట‌రీ విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు వ్య‌తిరేకంగా కుటుంబాల‌తో సహా ప్ర‌జ‌లు రోడ్డెక్కుతున్నార‌నేది గ‌మ‌నించాల‌ని కోరారు.

చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిని టెర్రరిస్టులుగా ముద్రవేసి తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపుతోందని - ఈ ప్రభుత్వానికి సున్నం రాసే రోజులు దగ్గర పడుతున్నాయని మధు విమర్శించారు. తమ గొంతులో ప్రాణముండగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని జరగనీయబోమని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలూ వదిలేస్తే తాము ఈ ఉద్యమాన్ని నడుపుతున్నామని చెప్పారు. కొత్తోట సభకు వచ్చి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేస్తామని ప్రగల్భాలు పలికిన నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు - ఇప్పుడు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ఎలాగైనా ఫ్యాక్టరీ నిర్మాణం జరపడానికి తమ చొక్కాలు చింపుకుంటున్నారని మధు విమర్శించారు. ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ - వైసీపీ అధినేత జగన్ మోహన్‌ రెడ్డిలకు మధు కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారులను నయవంచనకు గురిచేసి 40 గ్రామాల ప్రజలను నట్టేటముంచడానికి ప్రయత్నిస్తున్న ఆనంద గ్రూప్‌ సంస్థల ప్రతినిధులకు త్వరలో సరైన సమాధానం చెబుతామని మధు హెచ్చరించారు.

ఈ సంద‌ర్భంగా ఏఓబీలో జ‌రిగిన ఎన్‌ కౌంట‌ర్‌ పై మధు మండిప‌డ్డారు. చంద్రబాబు రాక్షస పాలన సాగిస్తూ పౌర హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. మావోయిస్టుల ఎన్‌ కౌంటర్‌ బూటకమని - న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. యుద్ధంలో దొరికిన శత్రు సైనికులను కూడా విచారణ జరిపి శిక్షిస్తారని, ఈ విధంగా చంపరని అన్నారు. పౌరహక్కులు కాపాడేందుకు ప్రజాసంఘాలతో కలిసి డిసెంబర్‌లో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులను చంద్రబాబు ఉగ్రవాదులంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం తగదన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో చంద్రబాబు మత్స్యకారుల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. భీమవరంలోని యనమదుర్రు డ్రెయిన్‌ కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ త్వరలో తణుకు నుంచి భీమవరం వరకూ పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. నరసాపురం పరిసర ప్రాంతాల్లో ప్రజలు తాగేందుకు స్వచ్ఛమైన నీరు కూడా దొరకడం లేదన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News