ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తే దేశ‌ద్రోహం కాదు

Update: 2016-09-06 09:47 GMT
రాజ‌కీయాల్లో ఏదైనా ఉండొచ్చు కానీ అహంకారం అస్స‌లు ప‌నికిరాదు. ఆ విష‌యాన్ని గుర్తించిన రాజ‌కీయ నాయ‌కుడికి తిరుగు ఉండ‌దు. కానీ ఆ మ‌ర్మాన్ని తెలుసుకోని రాజ‌కీయ అధినేత‌కు తిప్ప‌లు త‌ప్ప‌వు. తాజాగా అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌. అహంభావానికి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే ఆమె తీరు వివాదాస్ప‌దంగా ఉంటుంది. ఎవ‌రినైనా డోన్ట్ కేర్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న విమ‌ర్శ‌లు ఆమె చుట్టూ తిరుగుతుంటాయి. ఆమె పాల‌న‌ను విమ‌ర్శించిన వారికి కేసులు వెల్ కం చెబుతుంటాయి.

ఆమె వైఖ‌రి ప్ర‌జాస్వామ్య‌యుతంగా ఉండ‌ద‌ని ప‌లువురు విమ‌ర్శించినా ఆమె అస్స‌లు ప‌ట్టించుకోరు. ఈ మ‌ధ్య‌నే ఆమె స‌ర్కారు పెట్టే ప‌రువు న‌ష్టంకేసుల‌పై సుప్రీంకోర్టు సైతం ఘాటుగా రియాక్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను.. త‌న ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించేవారిని.. త‌ప్పు ప‌ట్టే వారిని  కేసుల‌తో ముప్ప తిప్ప‌లు పెట్ట‌టం అమ్మ‌కు అల‌వాటే. ఆమె పెట్టిన కేసుల మీద ఆ మ‌ధ్య‌న సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ప్ర‌జాజీవితంలో ఉన్న వారిపై విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు మామూలేన‌ని.. అలాంటి వాటిపై కేసుల‌తో రియాక్ట్ కాకూడ‌దంటూ హిత‌వు ప‌లికింది.

తాజాగా ఒక కేసుకు సంబంధించి అమ్మ వైఖ‌రిని ప‌రోక్షంగా విమ‌ర్శిస్తూ సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌టం దేశ‌ద్రోహం కింద‌కో.. ప‌రువు న‌ష్టం కింద‌కో రాద‌న్న సుప్రీంకోర్టు.. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన వారిపై ఈ త‌ర‌హా కేసులు పెట్టొద్ద‌ని తాజాగా స్ప‌ష్టం చేసింది. దేశ ద్రోహానికి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించాల‌ని.. దేశ‌ద్రోహం అనేది తీవ్ర‌మైన నేర‌మ‌ని.. అయితే దానిని దుర్వినియోగం చేస్తున్న‌ట్లుగా ప్ర‌ముఖ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ వాదించారు.

త‌మిళ‌నాడులోని కుడంకుళం న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేసిన వారిని.. కార్టూనిస్ట్ అసీం త్రివేదిపై దేశ‌ద్రోహం కేసు పెట్ట‌టాన్ని ఈ సంద‌ర్భంగా ఉదాహ‌ర‌ణ‌గా చూపించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఎవ‌రైనా వ్యాఖ్య‌లు చేస్తే దేశ‌ద్రోహం కేసు పెట్ట‌కూడ‌ద‌ని పేర్కొంది. దేశ ద్రోహం చ‌ట్టం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదని.. ఇప్ప‌టికే చ‌ట్టంలో  వివ‌రంగా ఉంద‌న్న‌కోర్టు.. తానిచ్చిన తాజా తీర్పు కాపీని అన్ని రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు.. రాష్ట్ర డీజీపీల‌కు పంపాల‌ని పేర్కొంది. మ‌రి.. ఈ తీర్పును కీల‌క అధికారులే కాదు.. పాల‌క‌ప‌క్ష అధినేత‌లు కూడా తెలుసుకుంటే మంచిదేమో..!
Tags:    

Similar News