క్రూడ్ ఆయిల్ అంతలా పడిపోయినా.. మనకు లాభం లేదే?

Update: 2020-03-31 20:30 GMT
అంతర్జాతీయంగా ముడిచమురుధరలు పెరిగినంతనే.. మన దగ్గర పెట్రోల్.. డీజిల్ ధరలు వేగంగా మారిపోతుంటాయి. ధరలు పెరగటం.. తగ్గటం అంతా అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాలకు అనుగుణంగానే అన్నట్లు చెప్పినా.. ప్రాక్టికల్ గా చూసినప్పుడు మాత్రం అందులో నిజం లేదన్న భావన కలగటం ఖాయం.

ఎందుకంటే.. ధరలు పెరిగిన వెంటనే దాని భారాన్ని జనాల మీద బదిలీ చేసే కేంద్రం.. తగ్గినప్పుడు మాత్రం ఆ ప్రయోజనాన్ని ప్రజలకు పంచే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తుండటం మొదట్నించి ఉన్నదే. ఇప్పుడు అలానే ఉంది.కాకుంటే.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత కనిష్ఠ స్థాయికి ముడిచమురు ధరలు తగ్గినా ఎలాంటి ప్రయోజనం కలగని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం.. పెట్రోల్.. డీజిల్ అమ్మకాల మీద వచ్చే ఆదాయం మీద కేంద్రం భారీగా ఆధారపడటమేనని చెబుతన్నారు.

దీంతో.. మాటలకు.. చేతలకు సంబంధం లేని రీతిలో వ్యవహరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా కారణంగా అన్ని దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోవటం.. ప్రయాణాలు ఆగిపోవటం.. జనాలు రోడ్ల మీదకు రావటం తగ్గిపోవటంతో పెట్రోల్.. డీజిల్ వినియోగం భారీగా తగ్గిపోయింది. అంతర్జాతీయంగా విమానసర్వీసులు పూర్తిగా నిలిచిపోవటంతో రోజువారీగా ఉండే డిమాండ్ ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా పడిపోయింది. దీని ప్రభావం ముడిచమురు ధరల మీద పడ్డాయి.

పదిహేడేళ్ల కనిష్ఠానికి ముడిచమురు ధరలు తగ్గిపోయాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కేవలం 23 డాలర్లకు తగ్గిపోయింది. 2002 నవంబరు తర్వాత ఇంత తక్కువకు ధరలు పడిపోవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గడిచిన పదిహేడేళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువగా ముడిచమురు ధరలు పడిపోయినా.. దాని ప్రయోజనం మాత్రం ప్రజలకు చేరటం లేదు. ఇటీవల కేంద్రం పెట్రోల్.. డీజిల్ మీద ఎక్సైజ్ సుంకాన్ని పెంచటంతో ఆ భారాన్ని ప్రజల మీదకు వేయకుండా.. కంపెనీలు సర్దుబాటు చేసుకున్నాయి. బ్యారెల్ ముడిచమురు ధరలు ఇంత భారీగా పడిపోయిన తర్వాత కూడా పెట్రోల్.. డీజిల్ ధరల్లో మాత్రం పెద్దగా మార్పు లేకపోవటం గమనార్హం. పెరిగేటప్పుడు బాదేసే ప్రభుత్వాలు.. ధరలు తగ్గినప్పుడు మాత్రం ఆ లాభాన్ని ప్రజలకు బదిలీ చేయకపోవటం చూస్తే.. ప్రభుత్వాల తీరు తొండి ఆడినట్లుగా అనిపించక మానదు.
Tags:    

Similar News