ఏపీలో కర్ఫ్యూ మరో 10 రోజులు పొడిగింపు.. ఆంక్షలు యథాతథం !

Update: 2021-05-31 09:43 GMT
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అమలు అవుతోన్న కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ లో అధికారంలో ఉన్న జగన్  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజు రోజుకూ కేసులు తగ్గుతున్నప్పటికీ, కరోనా కట్టడికి మరికొన్ని రోజులు కర్ఫ్యూని కఠినంగా అమలు చేయడమే మంచిదని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. కొద్ది వారాలుగా అమల్లో ఉన్న కర్ఫ్యూ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రానందున కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో  జూన్‌ 10 తేదీ వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న సడలింపు సమయం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా కరోనా చైన్ తెగిపోవాలి అంటే మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని సీఎం జగన్ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు అమలు చేస్తున్న సడలింపుల్లో ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దని సీఎం జగన్ స్పష్టం చేశారు.ఏపీలో కఠిన కర్ఫ్యూ ఫలితాలను ఇస్తోందనే చెప్పాలి.. గత వారం రోజుల ముందు వరకు ప్రతి రోజూ 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యేవి.. కానీ పగటి కర్ఫ్యూను కఠినంగా అమలు చేయడంతో.. ప్రస్తుతం పరిస్థితి కాస్త ఊరటనిస్తోంది. గత రెండు రోజులు కూడా 14 వేల లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో పూర్తి రిలాక్స్ అవ్వడం కన్నా, మరింత కఠినంగా వ్యవహిరిస్తే పూర్తిగా కరోనాను కట్టడి చేయొచ్చని సీఎం జగన్ భావిస్తున్నారు.  ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య మాత్రం ఆందోళన పెంచుతూనే ఉంది. ప్రతి రోజు వందకు అటు ఇటుగా కరోనా బారిన పడి మరణిస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 9వ తేదీ వరకు లాక్‌ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News