లిక్కర్ షాపుల్లో కరెన్సీ బిజినెస్

Update: 2016-11-28 07:19 GMT
పెద్ద నోట్ల రద్దు తరువాత నోట్ల మార్సిడి వ్యాపారం బాగా ఊపందుకుంది.  బ్యాంకులు - బయట మాత్రమే కాదు ఇప్పుడు మద్యం షాపులు కూడా ఈ కరెన్సీ ఎక్స్చేంచి కేంద్రాలుగా మారిపోయాయి. పెద్ద  నోట్ల రద్దుతో తొలుత వ్యాపారం కాస్త మందగించడంతో కంగారు పడిన మద్యం వ్యాపారాలు వెంటనే కొత్త  ప్లాన్ రచించారు. పెద్ద నోట్లకు  మొత్తం విలువకు సరిపడా మద్యం ఇచ్చి వ్యాపారం పెంచుకోవడం ఒకెత్తయితే.... కమీషన్ మినహాయించుకుని పెద్ద నోట్లు మార్చే బిజినెస్ ఇంకోటి. దీంతో మద్యం దుకాణాల యజమానులు  కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు.

బార్‌ అండ్‌ రెస్టారెంట్లు - మద్యం షాపుల నిర్వాహకులు రూ.100కి రూ.30 నుంచి రూ.40 కమీషన్‌ గా తీసుకొని నోట్ల మార్పిడీకి పాల్పడుతున్నారు. రోజుకు రూ.కోట్లలోనే మద్యం షాపుల ద్వారా నోట్ల మార్పిడి వ్యవహారాలు సాగుతున్నట్టు ఎక్సైజు అధికారులే స్వయంగా అంగీకరిస్తున్నారు. ఈ నెల 8న కేంద్రం రూ.500 - రూ.1000 నోట్ల చెలామణిని రద్దు చేసింది. అప్పటికే నోట్లు ఉన్నవారు బ్యాంకుల్లోను - నిర్థేశిత సంస్థల ద్వారా పాత నోట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించింది. వ్యాపార సంస్థలు కూడా పాత నోట్లు తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఖాతాలు లేని వారు తగిన ఆధారాలు తీసుకొచ్చి నేరుగా బ్యాంకుల్లో రోజుకు రూ.4వేలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది. 24 నుంచి బ్యాంకు ఖాతాల్లో పాత నోట్లను జమ చేసేందుకు అవకాశం ఇచ్చారు. రైల్వే - ఆర్టీసీ తదితర ప్రభుత్వ సంస్థలు మినహా మిగిలిన వారు పాత నోట్లు తీసుకునేందుకు ఏమాత్రం అవకాశం లేదు. అది కూడా డిసెంబర్‌ 30 మాత్రమే బ్యాంకు ఖాతాల్లో పాత నోట్ల డిపాజిట్‌ కు కేంద్రం అవకాశం ఇచ్చింది. బయట నోట్ల మార్పిడీని కేంద్రం విధించిన నిషేధం మద్యం షాపుల నిర్వాహకులకు వరంగా మారింది. ప్రభుత్వ నిబంధనలతో వీరు కమీషన్‌ ప్రాతిపదికన పాత నోట్ల మార్పిడీకి తెరలేపారు. రాష్ట్రంలో రోజుకు రూ.30కోట్ల మేర మద్యం అమ్మకాలు సాగుతున్నట్లు ఎక్సైజు అధికారులు చెపుతున్నారు. ఇందులో సగానికి పైగా మద్యం షాపుల నిర్వాహకులు పాత నోట్లను తమ ఖాతాల్లో జమచేయడాన్ని బట్టి వీరే స్థాయిలో కమిషన్‌ వ్యాపారం చేస్తున్నారో అర్థమవుతోంది.

మద్యం అమ్మకాలను బట్టి ఆయా మొత్తాలను బ్యాంకులో జమ చేసుకునే అవకాశం ఉండటంతో వీరి వ్యవహారం గుట్టుచప్పుడు కాకుంగా సాగుతోంది. మద్యం అమ్మకాలకు బిల్లులు ఇవ్వరు కాబట్టి ఎంత మొత్తంలో అమ్మకాలు జరిగాయనేది వారికి మినహా ఇతరులకు తెలిసే అవకాశం లేదు. కాకుంటే ప్రభుత్వం బేవరేజెస్‌ గోదాముల నుంచి తీసుకున్న సరుకుకు సంబంధించిన లావాదేవీలను రోజువారీ పుస్తకాల్లో నమోదు చేస్తుంటారు. కమీషన్‌ పద్దతిలో తీసుకుంటున్న పాత నోట్లను అమ్మకాలుగా పేర్కొంటూ వీరు తమ ఖాతాల్లో జమ చేస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News