ఆ పని చేస్తానంటే ఇంటికొచ్చి వెహికిల్ లో తీసుకెళ్లి తీసుకొస్తారట!

Update: 2020-04-12 05:05 GMT
లాక్ డౌన్ వేళ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి. అత్యవసరాల కోసం.. నిత్యవసరాల కోసం బయకు వచ్చినా మూడు కి.మీ. మేర మాత్రమే తిరిగే పరిస్థితి. అంతకు మించి బయటకు వెళ్లాలంటే సవాలచ్చ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఇందులో ఏ మాత్రం తేడా దొర్లినా మొదటికే మోసం తప్పదు.

అంతేనా.. కేసులు చుట్టుకోవటమే కాదు.. వాహనాల్ని సీజ్ చేసే వరకూ విషయం వెళుతుంది. ఇలాంటివేళ.. ఒక విషయానికి ఓకే అంటే.. ఇంటికి వెహికిల్ తీసుకొచ్చి వెంట తీసుకెళ్లటమే కాదు.. తిరిగి తీసుకొస్తారని చెబుతున్నారు సైబరాబాద్ పోలీసులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ ఎమర్జెన్సీ నెలకొంది.

దీంతో.. అత్యవసరంగా రక్త నిల్వల్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రమాదాల్లో గాయపడిన వారికి మాత్రమే కాదు.. తలసేమియా.. హిమోఫీలియా బాధితులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన రక్త కొరతను ఎదుర్కొంటున్నారు. కొరత తీవ్రత ఎంతంటే.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 15వేల యూనిట్ల రక్తం అవసరం. లాక్ డౌన్ వేళ ఆపరేషన్లు వాయిదా వేసిన నేపథ్యంలో తక్కువలో తక్కువ 7వేల యూనిట్ల కావాలి. కానీ.. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు కనిష్ఠానికి పడిపోయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం 700 యూనిట్లు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు.

అది కూడా గడిచిన నాలుగైదు రోజులుగా రక్తదాతలకు ఫోన్లు చేసి మరీ వారిని బ్లడ్ బ్యాంకు వద్దకు తీసుకొచ్చారు. అంత చేస్తేనే 70 యూనిట్ల రక్తాన్ని మాత్రమే తీసుకోగలిగారు. రానున్న వారంలో రక్త నిల్వలు మరింత తగ్గే ప్రమాదం ఉందని.. ఇప్పుడు మేల్కొనకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఇంతటి దారుణ పరిస్థితి లేదంటున్నారు. ఇప్పుడున్న కొరతను అధిగమించేందుకు వీలుగా సైబరాబాద్ పోలీసులు సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు.

బ్లడ్ బ్యాంకుల్లో రక్తాన్ని ఇవ్వాలనుకున్న వారు తమను సంప్రదిస్తే.. వారింటికే వాహనం తీసుకెళ్లి.. వారిని బ్లడ్ బ్యాంక్ వద్ద దింపి.. తిరిగి ఇంటికి తామే దింపుతామని ప్రకటించారు. ఇలా చేస్తేనైనా రక్తదాతలు ముందుకు వస్తారని భావిస్తున్నారు. రక్త దాతలు సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్ల 9490617440 - 9490617431కు ఫోన్ చేస్తే సరిపోతుంది.
Tags:    

Similar News