కాసింత సుఖానికి కక్కుర్తిపడిన విశాఖ కుర్రాడ్ని కొల్లగొట్టేసింది

Update: 2021-08-13 07:49 GMT
రోజులు మారాయి. కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. మనిషిలోని బలహీనతనే పెట్టుబడిగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు దోచేయటం మొదలు పెట్టారు. కళ్లం లేని గుర్రంలా సంచరించే మనసును ఎవరికి వారు గుంభనంగా గుండెల్లో దాచేసుకుంటారు. బయటకు వస్తే బాగోదని ఎప్పటికప్పుడు సర్దిచెప్పుకుంటారు. సరిగ్గా ఇలాంటి వారిని టార్గెట్ చేయటం.. వారి గుండెల్ని సీక్రెట్ గా మీటుతున్నట్లుగా చెప్పి.. ట్రాప్ చేసి అడ్డంగా బుక్ చేసే సరికొత్త మాయాజాలం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా ఇలాంటి తీరుకే బుక్ అయ్యాడువిశాఖపట్నానికి చెందిన కుర్రాడు.

ఇటీవల కాలంలో పెరిగిపోయిన సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్.. బలహీనతలే. ఉత్తినే ఏదీ రాదన్న చిన్న పాయింట్ మిస్ అయి.. ఆశపడిన ప్రతి ఒక్కరి జేబుల్ని ఖాళీ చేయటమే కాదు.. క్షణక్షణం కుమిలిపోయేలా చేయటం ఈ నేరాల ప్రత్యేకత. మన సెల్ ఫోన్ కు కాలక్షేంగా మాట్లాడేందుకు.. ఏకాంతాన్ని పోగొట్టేందుకు ఫలానా నెంబర్ కు ఫోన్ చేస్తే చాలన్న మెసేజ్ లు వస్తుంటాయి. కొందరు వీటిని చూసినంతనే వాటిని డిలీట్ చేసి.. దరిద్రాన్ని వదిలించుకుంటారు.

మరికొందరు మాత్రం.. దాని సంగతి చూద్దామన్న కుతూహలంతో ఫోన్ చేసి అడ్డంగా బుక్ అయిపోతారు. విశాఖపట్నానికి చెందిన 26 ఏళ్ల ఐటీ ఉద్యోగి ఫోన్ కు ఇలాంటి మెసేజ్ ఒకటి వచ్చింది. దీంతో ఫాంటసీ ఆలోచనలోకి వెళ్లిన అతడు.. ఆ నెంబర్ కు ఫోన్ చేయటం.. ఒక స్వీట్ వాయిస్ పరిచయం చేసుకోవటం.. మంచి స్నేహితురాలినని నమ్మించటం.. మాటల్లో నుంచి ముగ్గు దించటంలోకి వెళ్లటం.. చివరకు సెక్స్ చాట్ చేద్దామంటూ ట్రాప్ విసిరింది.

ఇలాంటి ఫాంటసీ కోసం చూస్తున్న అతగాడు ముంచుకొస్తున్న ముప్పును గుర్తించక.. ఓకే చెప్పేశాడు. సదరు మహిళ చెప్పినట్లే సెక్స్ చాట్ చేశాడు. అతడి వీడియోకాల్ ను ఎంచక్కా రికార్డు చేసిన ఆమె.. అతడికి ఆ క్లిప్పులు పంపి.. వెంటనే తాను కోరినంత డబ్బులు ఇవ్వాలని లేకుండా వాటిని సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టేస్తామంటూ బెదిరించసాగారు. దీంతో.. భయపడిన విశాఖ కుర్రాడు దఫదఫాలుగా రూ.24 లక్షలు ఇచ్చాడు. అయినప్పటికీ తగ్గక వేధిస్తున్న వేధింపుల్ని తట్టుకోలేక పోలీసుల్ని ఆశ్రయించి బావురమన్నాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కాల్స్ ను.. బ్యాంకు ఖాతాల్ని ట్రేస్ చేయగా.. ఈ ముఠా హైదరాబాద్ లోని జీడిమెట్లకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. రహీమ్.. గుండా జ్యోతి.. వీర సతీఫ్ అనే ముగ్గురు ముఠాగా ఏర్పడి ఆన్ లైన్ లో మోసాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని రూ.3.5లక్షల క్యాష్.. ల్యాప్ టాప్.. ఐదు మొబైళ్లు.. మూడు ఎటీఎం కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఉదంతాలెన్నో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. తాత్కాలిక సుఖం కోసం వెంపర్లాడితే అందుకు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న వాస్తవాన్ని అస్సలు మర్చిపోకూడదు. లేకుంటే.. భారీగా నష్టపోవటం ఖాయం.




Tags:    

Similar News