అచ్చు లీడర్‌ సినిమాలో మాదిరే డీఎస్‌ మాట్లాడారే?

Update: 2015-07-01 09:13 GMT
ఆ మధ్యన శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్‌ సినిమా గుర్తుందా? అందులో ఒక సీన్‌లో.. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు జరుగుతుంటాయి. సీఎం పోస్ట్‌ని ఆశించే వ్యక్తి.. ఆ పార్టీలో కాస్త బలం ఉన్న మరో నేత మధ్య పెద్దమనిషి ఒకరు రాజీ చర్చలు చేపడుతుంటారు. తనకు హోంతో పాటు మరికొన్ని పదవులు ఇవ్వాలని అడగటం..బేరాలాడటం జరుగుతుంది. కట్‌ చేస్తే.. బయటకు వచ్చిన వారు.. జస్ట్‌ అలా పరామర్శ కోసమే వచ్చాను తప్పించి.. మరెలాంటి రాజకీయ సమావేశం కాదని మీడియాకి చెప్పి వెళ్లిపోతారు.

తాజాగా సీనియర్‌ కాంగ్రెస్‌ నేత డీఎస్‌ వ్యవహారం ఇంచుమించు ఇలానే ఉంది. ఎప్పుడూ లేనిది.. ఈ పెద్దమనిషి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వల్ప అనారోగ్యానికి గురైన నేపథ్యంలో పరామర్శించటానికి వచ్చినట్లుగా చెప్పుకున్నారు. రెండు రోజుల నుంచి డీఎస్‌ పార్టీ మారే విషయంపై మీడియాలో పెద్దఎత్తున వార్తలు రావటం.. మంగళవారం నాడు పార్టీ అధినేత్రి సోనియాకు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రాయటం లాంటివన్ని జరిగిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అంటే.. అదెలా ఉంటుందన్నది ఊహించుకోవటం పెద్ద విషయం ఏమీ కాదు.

కానీ.. దానికి భిన్నంగా.. తమ భేటీ కేవలం.. పరామర్శకు తప్పించి.. రాజకీయంగా ఎలాంటి ప్రత్యేకత లేదని.. కేసీఆర్‌కు ఆరోగ్యం బాగోలేదంటే.. ఎలా ఉందో పలుకరించటానికే తాను వచ్చినట్లుగా డీఎస్‌  మీడియాకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు.. డీఎస్‌ ఈ నెల మొదటి వారంలో తెలంగాణ అధికారపక్షంలో చేరనున్నారన్న విషయం మీడియాలో ప్రముఖంగా రావటం గమనార్హం.

Tags:    

Similar News