అవును.. అమరావతే చంద్రుళ్లను కలిపింది

Update: 2015-10-21 15:26 GMT
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతగా అందరికి సుపరిచితుడైన డి శ్రీనివాస్ ఈ మధ్యనే తెలంగాణ అధికారపక్షంలో భాగస్వామి కావటం తెలిసిందే. బుధవారం ఆయనకు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం పలికేందుకు తెలుగుదేశం నేతలు పెద్దఎత్తున ఆయన్ను కలిశారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా  డి. శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి స్నేహితులని.. వారి మధ్య అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు.

అమరావతి శంకుస్థాపన కారణంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మళ్లీ స్నేహం చిగురించిందన్న డీఎస్.. తాజాగా మొదలైన అనుబంధం రెండు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. చంద్రుళ్లు ఇద్దరు దీర్ఘ కాలంగా మంచి స్నేహితులన్న విషయాన్ని మర్చిపోకూడదని గుర్తు చేశారు.

తెలుగుదేశం పార్టీతో తన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసిన కేసీఆర్.. ఒకదశలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే వారు. ఆయనతో కలిసి పలు కార్యక్రమాలను డిజైన్ చేశారు కూడా. అలాంటి ఆయన చివర్లో బాబును విభేదిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చేసి టీఆర్ ఎస్ పార్టీ ఏర్పాటు చేసి.. తెలంగాణ ఉద్యమాన్ని షురూ చేశారు. తన మాటలతో గతాన్ని గుర్తు చేసిన డీఎస్.. అమరావతి శంకుస్థాపనతో బాబు.. కేసీఆర్ ల మధ్య స్నేహబంధం సరికొత్త అధ్యాయం మొదలైందని వ్యాఖ్యానించారు. మొత్తానికి బాబు.. కేసీఆర్ ల మధ్య తాజాగా కుదిరిన బంధం సుదీర్ఘ కాలం పాటు సాగేదన్న సంకేతాల్ని డీఎస్ ఇవ్వటం ఆసక్తికరమే.
Tags:    

Similar News