దాచేప‌ల్లి నిందితుడి ఆత్మ‌హ‌త్య

Update: 2018-05-04 06:27 GMT
నిర్భయ లాంటి కఠినమైన చట్టాలొచ్చినా మహిళలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. ఈ మధ్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆసిఫా హత్యాచార ఘటన మరువక ముందే దాచేపల్లిలో ఆ ఘటన చోటుచేసుకోవడం దారుణంగా చెప్పవచ్చు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల సుబ్బయ్య అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడడంతో దాచేపల్లి ఒక్కసారిగా అట్టుడుకుతోంది. కామంతో కళ్ళుమూసుకుపోయిన దుర్మార్గుడు అన్నం సుబ్బయ్య(50) అభంశుభం తెలియని మనవరాలు వయసున్న 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. బాలిక తల్లిదండ్రులకు ఆలస్యంగా విషయం తెలియడంతో.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈలోగా సుబ్బయ్య పారిపోయాడు. ఆయ‌న కోసం పోలీసులు గాలింపు చేప‌ట్టారు. మ‌రోవైపు నిందితుడిని పట్టిచ్చినవారికి నగదు బహుమతి ఇస్తామని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే ఆయ‌న స‌జీవంగా దొరికే చాన్స్ లేద‌ని తెలుస్తోంది.

ఈ ఆకృత్యానికి పాల్ప‌డ్డ వృద్ధుడు సుబ్బయ్య తన బంధువులకు ఫోన్ చేసి.. తాను చనిపోతున్నట్టు చెప్పాడు. బుధవారం రాత్రి సుబ్బయ్య బందువులకు ఫోన్ చేయగా.. ఎందుకు ఈ అత్యాచారం చేశావని అడిగారు. దానికి సమాధానం ఇవ్వకుండా.. తాను చనిపోతున్నానని వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బంధువులు పోలీసులకు తెలిపారు. సుబ్బయ్య సెల్ ఫోన్ సిగ్నల్ కృష్ణానది తీర గ్రామమైన తంగెడ సెల్ టవర్ ను చూపించింది. దీంతో సుబ్బయ్య నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చన్న కోణంలో.. పోలీసులు నదిలో గాలింపు చర్యలు కొనసాగించారు. ఇదిలాఉండ‌గా...దాచేపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురజాల మండలం దైద దగ్గరు చెట్టుకు ఉరేసుకుని సుబ్చయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అమరలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం సుబ్బయ్య లేదా వేరొకరిదా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. హైడ్రామా నడుస్తోంది. సుబ్చయ్య ఆత్మహత్యపై పోలీసులు స్పష్టత ఇవ్వనున్నారు. మరోవైపు  దాచేపల్లి అత్యాచార ఘటన దురదృష్టకరమని ఏపీ హోం మంత్రి చినరాజప్ప తెలిపారు.అత్యాచార ఘటనపై ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, తమ తప్పును ఒప్పుకుంటున్నామని ఆయన వెల్లడించారు.  శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని శుక్రవారం చినరాజప్ప పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామి ఇచ్చారు.

Tags:    

Similar News