ప్రెస్ మీట్ లోకి దూసుకొచ్చి..ఛాన‌ల్ గొట్టాల‌తో కొట్టారు!

Update: 2019-05-22 05:08 GMT
హైద‌రాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ లో ఒక ప్రెస్ మీట్ జ‌రుగుతోంది. రోజులో త‌క్కువ‌లో త‌క్కువ మూడు నుంచి ఐదారు ప్రెస్ మీట్లు రోజూ అక్క‌డ జ‌రుగుతుంటాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేని రీతిలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రుగుతున్న ప్రెస్ మీట్లోకి కొంత‌మంది దూసుకొచ్చారు. రావ‌టంతోనే బూతుపురాణం అందుకున్న వారు.. ప్రెస్ మీట్ పెట్టినోళ్ల మీద దాడి చేశారు. అందుకోసం వారు ఉప‌యోగించిన ఆయుధాలు ఏమిటో తెలుసా?.. టీవీ ఛాన‌ళ్ల లోగో గొట్టాలు.

గ‌తంలో ఇంత‌కు ముందెప్పుడూ చోటు చేసుకోని ఈ ఉదంతంతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డిన మీడియా ప్ర‌తినిధులు.. ప్రెస్ క్ల‌బ్ లో ఈ లొల్లేమిటంటూ ప్ర‌శ్నించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన వారు.. మీడియా ప్ర‌తినిధుల మీద దాడి చేయ‌టానికి వెనుకాడ‌లేదు. ఇంత‌గా చెల‌రేగిపోయిన వారెవ‌రు?  వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిట‌న్న‌ది చూసిన‌ప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాలే కాదు.. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన సంగ‌తులు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐపీఎస్ అధికారి ఉన్నారు. ఆయ‌న పేరు ప్ర‌వీణ్ కుమార్. ప్ర‌స్తుతం ఆయ‌న గురుకుల విద్యా కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న‌కు చెందిన సొంత సంస్థ పేరు స్వేరోస్. ప్ర‌భుత్వం ఆయ‌న‌కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వ‌టంతో ఆయ‌న త‌నకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న‌ట్లుగా కొంద‌రు ఆరోపిస్తున్నారు. అలా ఆరోపించే వారిలో జాతీయ ఎస్సీ రిజ‌ర్వేష‌న్ ప‌రిర‌క్ష‌ణ స‌మితి అధ్యక్షుడు క‌ర్నె శ్రీ‌శైలం.

రెండు రోజుల క్రితం ఆయ‌న త‌న మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్ న‌రసింహ‌న్ ను క‌లిసి.. విన‌తిప‌త్రాన్ని అంద‌జేశారు. స్వేరోస్ పేరుతో ఐపీఎస్ అధికారి ప్ర‌వీణ్ కుమార్ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. గురుకులాల్లో వివిధ కాంట్రాక్టుల‌ను స్వేరోస్ సంస్థ‌కు ఇస్తున్నార‌ని.. మ‌త మార్పిడి కేంద్రాలుగా మారుస్తున్న‌ట్లుగా ఆయ‌న పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో గురుకులాల్లో భార‌త‌దేశం నా మాతృభూమి అన్న ప్లెడ్జ్ బ‌దులుగా స్వేరోస్ పేరుతో ప్లెడ్జ్ చేయిస్తున్న‌ట్లు ఆరోపించారు.

ఇలాంటి హాట్ హాట్ అంశాల్ని మీడియా ముందుకు తీసుకొస్తున్న వేళ‌లోనే శ్రీ‌శైలంపైన ప‌ది మందితో కూడిన బృందం ఒక‌టి ఆయ‌న‌పై దాడి చేశారు. పోలీసులు వ‌చ్చి శ్రీ‌శైలంపై దాడికి పాల్ప‌డ్డ వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్ప‌డిన వారిలో కొంద‌రు ఓయూ విద్యార్థులు ఉన్నట్లుగా గుర్తించి వారిపై వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. ప్రెస్ క్ల‌బ్ లో మీడియా  మీట్ జ‌రుగుతున్న వేళ‌.. వ‌చ్చి వీరంగం వేయ‌ట‌మే కాదు.. మీడియా లోగో గొట్టాల‌తో దాడి చేయ‌టం.. మీడియా ప్ర‌తినిధుల‌పైనా చేయి చేసుకోవ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇలా ఎవ‌రికి వారు ఎక్క‌డిప‌డితే అక్క‌డ‌.. ఎవ‌రిని ప‌డితే వారిపైన దాడి చేస్తే ఎలా?  తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఇలాంటి వ్య‌వ‌హారాల మీద దృష్టి పెట్ట‌రా? 
Tags:    

Similar News