బిహార్ కాదు.. అనంతపురం జిల్లా కేపీదొడ్డి

Update: 2019-08-17 07:08 GMT
వారిద్దరూ మైనర్లు. ప్రేమించుకున్నారు. కలిసి బతకాలనుకున్నారు. తమ పెద్దలకు చెబితే నో చెబుతారని భావించారు. అవగాహన ఉందో లేదో కానీ.. కలిసి బతుకుదామనుకున్న వారిద్దరూ గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఊరంతా ఏకమైంది. వెతుకులాట మొదలైంది. మొత్తానికి వారిద్దరిని గుర్తించారు. తర్వాతేం జరిగిందన్న దానికి నిదర్శనంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. నాగరిక ప్రపంచంలో ప్రేమించుకున్న నేరానికి ఇంత ఆరాచకంగా వ్యవహరిస్తారా? అన్న సందేహం కలిగేలా వ్యవహరించిన వైనం అనంతపురం జిల్లా కేపీదొడ్డిలో చోటు చేసుకుంది.

బిహార్ తరహా పంచాయితీని నిర్వహించి.. చుట్టూ వందకు పైగా గ్రామస్థుల మధ్యలో ప్రేమించుకున్న ఇద్దరిని దోషులుగా నిలబెట్టటమే కాదు.. ప్రేమించుకుంటారా?  ఒళ్లు బలిసిందా? అంటూ అనరాని మాటలు అంటూ.. ఆ అమ్మాయి చెంపల మీద ఛెళ్లు ఛెళ్లుమంటూ కొట్టటంటూ ఆగకుండా.. కాలితో దారుణంగా కొట్టటం.. కర్రతో పశువుల్ని బాదినట్లుగా బాదేయటం కనిపిస్తుంది.

అమ్మాయితో పాటు అబ్బాయిని.. దారుణంగా హింసించిన తీరు చూస్తే షాక్ తినాల్సిందే. ఇంత దారుణం జరుగుతుంటే.. గ్రామస్థులు కానీ.. పిల్లల తల్లిదండ్రులు కానీ అడ్డుకున్నది లేదు. గ్రామస్తుల్లో ఎవరో ఒకరు తీసిన వీడియో వైరల్ కావటంతో జరిగిన దారుణం ఎంతన్నది బయటకు వచ్చింది.  ఎంత ప్రేమించుకుంటే మాత్రం మరీ.. అంత రాక్షసంగా శిక్షిస్తారా? అన్నట్లుగా వారిని కొట్టిన వైనం ఒక ఎత్తు అయితే.. గ్రామపెద్ద కొడుతుంటే.. వెనుక నుంచి మరింత కొట్టాలంటూ రాయలేని బూతులు తిట్టేస్తూ.. ప్రోత్సహించిన వైనం నోట మాట రాని రీతిలో ఉందని చెప్పక తప్పదు. ఇదంతా చూస్తే.. ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించినా తక్కువే అన్న అభిప్రాయం కలగక మానదు. 

ఇంత జరిగినా.. ఈ ఉదంతంపై స్థానిక డీఎస్పీ వెంకటరమణ మాత్రం.. ఈ ఉదంతం తమ దృష్టికి రాలేదనటం గమనార్హం. జరిగిన రాక్షసత్వానికి నిదర్శనంగా వీడియో వైరల్ గా మారి అందరూ అవాక్కు అవుతుంటే.. అక్కడి పోలీసుల కంట్లో మాత్రం ఎందుకు పడలేదో?



Full View
Tags:    

Similar News