ఇది సంవిధాన్.. సంఘ్ బుక్ కాదు.. తొలి ప్రసంగంలోనే ఎంపీ ప్రియాంక నిప్పులు!

ప్రియాంక తన తొలి ప్రసంగంలోనే తనదైన ముద్ర చూపారు. అది కూడా రాజ్యాంగంపై చర్చలో ఆమె పాల్గొన్నారు.

Update: 2024-12-13 17:30 GMT

గాంధీల కుటుంబం నుంచి కాంగ్రెస్ తరఫున 40 ఏళ్ల తర్వాత ఓ మహిళ లోక్ సభ లో అడుగుపెట్టారు. సోనియా గాంధీ కూడా లోక్ సభలో సభ్యురాలిగా చేసినప్పటికీ.. ఆమె గాంధీ కుటుంబం కోడలు. కాబట్టి ఇందిరా గాంధీ తర్వాత ఈ ఇంటి నుంచి మహిళలు లోక్ సభ సభ్యులు కానట్టే. అయితే, మేనకా గాంధీ ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా చేసినా ఆమె సొంత పార్టీ, బీజేపీ నుంచి అడుగుపెట్టారు. అయితే, ఇన్నాళ్లకు గాంధీ కుటుంబ వారసురాలిగా ఇటీవల ఎంపీగా ఎన్నికయ్యారు ప్రియాంకా గాంధీ. దీంతోపాటు లోక్ సభ సమావేశాలు ప్రారంభం కావడంతో ఆమె ఏం మాట్లాడతారు? అనే ఆసక్తి నెలకొంది.

తొలి ప్రసంగంలోనే ముద్ర..

ప్రియాంక తన తొలి ప్రసంగంలోనే తనదైన ముద్ర చూపారు. అది కూడా రాజ్యాంగంపై చర్చలో ఆమె పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాజ్యాంగం ఆమోద ముద్ర పొంది 75 వ ఏడాదిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో లోక్‌ సభలో ప్రత్యేక చర్చ జరుగుతోంది. గమనార్హం ఏమంటే.. విపక్షాల తరఫున చర్చను ప్రియాంకనే ప్రారంభించడం. ఆమెకిదే తొలి ప్రసంగం కావడం. అయితే, అన్న రాహుల్ గాంధీ బాటలోనే సాగుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై నిప్పులు చెరిగారు.

రాజ్యాంగం అంటే సంఘ్‌ (ఆరెఎస్సెస్‌ ను ఉద్దేశిస్తూ) పుస్తకం కాదని.. సంవిధాన్ (రాజ్యాంగం) పుస్తకం అని ప్రియాంక పేర్కొన్నారు.

అన్నిటికీ మా ముత్తాతనే కారణమా..?

ఆర్ఎస్ఎస్, బీజేపీ తరచూ నెహ్రూ విధానాలను విమర్శిస్తూ ఉంటాయి. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితికి నెహ్రూనే కారణం అంటూ నిందిస్తాయి. దీంతో ప్రియాంక తన తొలి ప్రసంగంలోనే దీనిని ప్రస్తావించారు. ఎప్పుడూ గతమే మాట్లాడే బీజేపీ.. ఇప్పుడేం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో జరిగే అన్నిటికీ నెహ్రూనే కారణమా? ఆయనపేరును, ఆయన ప్రసంగాలను మీరు పుస్తకాల నుంచి తొలగించగలరేమో.. కానీ, స్వాతంత్ర్య పోరాటం, జాతి నిర్మాణంలోని పాత్రను చెరిపేయలేరు అని వ్యాఖ్యానించారు.

2017 నాటి యూపీ ఉన్నావ్‌ అత్యాచార ఘటనను ప్రియాంక ప్రస్తావించారు. ఇలాంటి సందర్భాల్లో బాధితులకు పోరాడే హక్కును రాజ్యాంగమే కల్పించిందన్నారు.

ఒక వ్యక్తి (అదానీ) కాపాడేందుకు 142 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాలను పక్కనపెట్టారని అదానీని ఉద్దేశిస్తూ ప్రియాంక ఆరోపించారు. సంపద, రోడ్లు, పోర్టులు, గనులు అన్నీ అదానీకేనా? అని నిలదీశారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల గొంతును అణచివేసేందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు.

సత్యం, అహింస పునాదులుగా సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ఇతర దేశాల కంటే ప్రత్యేకమైనదని.. అది ప్రజాస్వామ్య గళం అని ప్రియాంక పేర్కొన్నారు. దాన్నుంచి పుట్టినదే రాజ్యాంగం అని వివరించారు. బీఆర్ అంబేడ్కర్‌, మౌలానా ఆజాద్‌, రాజగోపాలాచారి, నెహ్రూ వంటి ఎందరో నేతలు ఏళ్లపాటు జీవితాలను అంకితం చేసి రాజ్యాంగాన్ని రూపొందించారని.. ఇది ప్రజలను కాపాడే ‘సురక్షా కవచం’ అని ప్రియాంక తెలిపారు. దీన్ని బద్దలుకొట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం పదేళ్లలో ఎన్నో ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. రిజర్వేషన్లను బలహీనపర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. లోక్‌ సభ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చాలని చూశారని.. అది జరగకపోవడంతో ఆ ప్రతిపాదనలపై వెనక్కతగ్గారని ప్రియాంక దుమ్మెత్తి పోశఆరు. ‘‘ఇది సంవిధాన్‌ (రాజ్యాంగం).. సంఘ్‌ రూల్‌ బుక్‌ కాదు’’ అని దుయ్యబట్టారు.

Tags:    

Similar News