దళితబంధు : లక్ష మందితో ప్రారంభోత్సవం .. 15 రోజుల్లో మరో రూ. 2 వేల కోట్లు !

Update: 2021-08-16 10:30 GMT
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన కొత్త పథకం దళితబంధు. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేసింది కేసీఆర్ సర్కార్. ఆగష్టు 16 నుంచి అంటే ఈ నెల 16 నుంచి హుజూరాబాద్‌ లో ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు భారీగా జన సమీకరణ చేపట్టారు. ఈ సభను దాదాపు లక్ష మందితో నిర్వహిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి దళిత కుటుంబాలు తరలివచ్చారు.

మొత్తం 20 ఎకరాల్లో లక్షా 20వేల మందితో సభ నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు. సభా ప్రాంగణంలోని స్టేజీపై సుమారు 250 మంది కూర్చునే విధంగా సిద్ధం చేశారు. వర్షం వచ్చే సూచనలు ఉండడంతో ముందు జాగ్రత్తగా రెయిన్‌ఫ్రూఫ్‌ టెంట్లను వేశారు. దళితబంధు పథకానికి హుజురాబాద్‌లో మొదట ఐదువేల కుటుంబాలను ఎంపిక చేశారు. ఇందుకోసం రూ. 500 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. దళిత బంధు పథకాన్ని అన్ని పార్టీలు స్వాగతించినప్పటికీ.. ఉపఎన్నిక సమయంలో, అది కూడా హుజురాబాద్ నియోజకవర్గంలోనే మొదటగా ఇవ్వడం పట్ల విమర్శలు గుప్పిస్తున్నాయి. ఒక్క హుజూరాబాద్‌కే పరిమితం కాకుండా తెలంగాణ అంతటా దళితులందరికీ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే కరోనా విజృంభణ సమయంలో లక్ష మందితో దళితబంధు ప్రారంభోత్సవం చేస్తుండటంతో విపక్షాలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అయితే, విపక్షాల అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని.. అర్హులైన అందరికీ దళిత బంధు అందుతుందని ఇప్పటికే మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించే విషయంలో కూడా ఒక సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. రైతుబంధు పథకానికి వేదిక అయిన శాలపల్లి, ఇందిరానగర్ గ్రామాలనే దళితబంధుకు కూడా వేదికలుగా ఎంచుకున్నారు. ఈ ‘దళితబంధు’ పథకం ప్రారంభోత్సవం సందర్భంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో లక్ష మందికి పైగా పాల్గొననుండటం గమనార్హం. వర్షం వచ్చినా ఇబ్బందులు కలగకుండా సభా ప్రాంగణంలో రెయిన్ ఫ్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. దళిత బంధు ప్రారంభోత్సవానికి హుజూరాబాద్‌ వస్తోన్న సీఎం కేసీఆర్‌కు భారీ ఎత్తున స్వాగత ఏర్పాటు చేశారు. పట్టణమంతా గులాబీమయమైంది. ఆటపాటలు, డప్పు వాయిద్యాల నడుమ ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నారు కళాకారులు. రకరకాల వేషాధారణతో కళాకారులు చేస్తోన్న కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.

హుజురాబాద్‌లోని శాలపల్లి దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగా సభకు సీఎం కేసీఆర్‌  చేరుకున్న తర్వాత, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటాలకు సీఎం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..దళిత బంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇదొక మహా ఉద్యమం. ఈ ఉద్యమమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. గతంలో నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు రకరకాల మాటలు విన్నాం. మీ అందరి దీవెనలతో రాష్ట్రం నలుమూలల ఉద్యం చెలరేగి 15 ఏళ్ల కృషి తర్వాత తెలంగాణను సాధించుకున్నాం. అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలను సాధించుకున్నాం అని చెప్పుకొచ్చారు.

దళిత బంధు పతకం నిజానికి ఏడాది క్రితమే ప్రారంభం కావాల్సిందని చెప్పిన సీఎం. కరోనా కారణంగా ఏడాది ఆలస్యమైందని పడిందని తెలిపారు. తాను దళిత బంధు గురించి ప్రకటించగానే ప్రతిపక్షాలు రకరకలా వ్యాఖ్యలు చేశారన్నారు. దళిత బంధు ఎవరికి ఇస్తామనే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతామని సీఎం వెల్లడించారు. తనకు దళిత బంధు ఆలోచన ఈరోజే పుట్టింది కాదని 25 ఏళ్ల క్రితం నుంచే తన ఆలోచనల్లో ఉందని కేసీఆర్‌ తెలిపారు. ఈ క్రమంలోనే తాను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే దళిత జ్యోతి పేరుతో పాటలు విడుదల చేశామని గుర్తుచేశారు. తెలంగాణ నేడు చేస్తోన్న ఈ పనిని దేశ ప్రధానులు చేసుంటే దళితులకు ఈ పరిస్థితి వచ్చేదా అని సీఎం అన్నారు. రెండు నెలల్లో హుజురాబాద్‌లోని ప్రతీ దళిత కుటుంబానికి రూ. పది లక్షలు అందిస్తామని తెలిపారు. హుజూరాబాద్‌ దళిత బంధు పథక అమలుకు ఒక ప్రయోగశాల అని సీఎం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేస్తున్న దళితులకు కూడా దళిత బంధు పథకం వర్తిస్తుంది. అయితే ఉద్యోగులు ఈ వరుసలో చివరిలో ఉండాలని, ఆకలితో ఉన్న వారిని మొదటి వరుసలో ఉంచాలని సీఎం తెలిపారు.

రూ. 500 కోట్లు మాత్రమే విడుదల చేశారు.. మిగితావి ఇస్తారా అన్ని కొందరు ప్రశ్నించారు. మిగతా డబ్బులు ఇచ్చే దమ్ము కేసీఆర్‌ కు లేదా, రానున్న 15 రోజుల్లో ఇంకో రూ. రెండు వేల కోట్లు ఇస్తాం. డబ్బులు మీ కలెక్టర్‌ దగ్గర ఉంటాయి, దళితులకు ఇవ్వండి. అయితే ఈ డబ్బులతో అందరూ ఒకే పని చేయకూడదు. ఈ పథకానికి బ్యాంకులతో పని లేదు. మళ్లీ డబ్బులు రిట్నర్‌ ఇవ్వమని ఎవరూ అడగరు. డబ్బును ఎలా వాడాలన్న దానిపై ఎలాంటి నిబంధనలు ఉండవు. మీకు నచ్చిన పని చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. మీకు అనుభవం ఉన్న పనులను మీరే సొంతంగా ప్రారంభించుకోవచ్చు. ఎలాంటి వ్యాపారం చేయాలని మీకు ఆలోచన లేకపోతే మీ కలెక్టర్‌ సలహా ఇస్తారు. రూ. పదిలక్షలను ఏడాది కాలంలో రూ. 20 లక్షలు చేయడమే దళిత బంధు ఉద్దేశం అని అన్నారు.
Tags:    

Similar News