జనవరిలో థర్డ్‌ వేవ్‌ .. పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే ?

Update: 2020-11-24 05:45 GMT
కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. మహమ్మారి వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా కూడా కరోనా మహమ్మారి పీడ పూర్తిగా తొలగిపోలేదు. గత కొన్ని రోజులుగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. అయితే , కరోనా వచ్చిన తర్వాత తమ ప్రాణాలని కూడా పణంగా పెట్టి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు ,మహమ్మారి నియంత్రణలో ముందుండి పోరాడిన ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌..   హెల్త్ ‌కేర్‌ వర్కర్లు మరోసారి అదే తెగువను చూపుతారా , ఇప్పటికే ఎన్నో ఒత్తిళ్లు, ఆందోళనలతో పాటు ఈ సుదీర్ఘ యుద్ధంలో తమ సహచరులను కొందరిని కోల్పోయిన వారియర్స్‌ మళ్లీ అలాంటి శారీరక, మానసిక సంఘర్షణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా , పరిస్థితి మళ్లీ చేతులు దాటి.. దేశవ్యాప్తంగా మరింత కఠిన లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తే ఏంటి పరిస్థితి. అందరి ఆలోచనల్లో ఇవే ప్రశ్నలు ..

అమెరికా, ఫ్రాన్స్, మెక్సికో సహా వివిధ ఐరోపా దేశాల్లో సెకండ్‌ వేవ్ ‌లో కేసుల తీవ్రత పెరగడంతో పాటు మరణాల సంఖ్యా ›పెరుగుతోంది. వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో పాటు పశ్చిమదేశాల్లోని వాతా వరణ పరిస్థితుల్లో  చికిత్సలో వాడే కొన్ని ముఖ్యమైన మందులు పనిచేయట్లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మాస్క్‌ మాత్రమే వ్యాక్సిన్‌ అని వైద్య నిపుణులు అంటున్నారు. మాస్క్‌ ను నిర్లక్ష్యం చేసిన దేశాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. ఐరోపా నుంచి వస్తున్న నివేదికలను బట్టి సెకండ్ ‌వేవ్‌ తీవ్రంగా ఉన్న దేశాల్లో ప్రతీ 17 సెకన్లకు ఒక మరణం సంభవిస్తోంది. గత వారంలోనే 29 వేల మంది చనిపోయారు. ఇప్పటికే మెక్సికోలో లక్ష మందిపైగా మత్యువాతపడ్డారు. ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో మరోసారి లాక్‌ డౌన్‌ విధించారు. భారత్‌ లో సెకండ్ ‌వేవ్‌ తీవ్రంగా వస్తే అది సునామీగా మారే ప్రమాదముంది. ఢిల్లీ, ముంబై తదితర చోట్ల కేసులు పెరుగుతున్నాయి. ప్రజల్లో కనిపిస్తోన్న నిర్లక్ష్యం, వైరస్‌ మ్యుటేటయ్యే అవకాశాలు, ఇంకా వ్యాక్సిన్‌ సిద్ధం కాకపోవడం వంటివి సవాల్‌గా మారతాయి. వైరస్‌ స్ట్రెయిన్లు మార్పు చెందుతూ ఉంటే మరణాల సంఖ్య పెరుగుతుంది.

కరోనా ప్రభాం తగ్గిపోయింది.. ఇక ఏమీ కాదనే అతి విశ్వాసం, అజాగ్రత్త, నిర్లక్ష్యం ప్రజల్లో కనిపిస్తోంది. మాస్క్‌లు పెట్టుకోకపోవడమే కాక భౌతికదూరాన్ని కూడా సరిగ్గా పాటించట్లేదు. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటివరకు జరిగిన కృషి అంతా ఈ నిర్లక్ష్యంతో వృథాగా మారే ప్రమాదముంది. ప్రజల అలసత్వం, నిర్లక్ష్యం వల్లే సెకండ్‌ వేవ్‌ వస్తుంది. కరోనా ‌ను ఎదుర్కొనే సన్నద్ధతను యూరప్‌ దేశాలు అసంపూర్తిగా వదిలేశాయని, అందుకే ఈ దుస్థితి దాపురించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రతినిధి డేవిడ్‌ నబార్రో చెప్పారు. ఆయన తాజాగా స్విట్జర్లాండ్ ‌లో మీడియాతో మాట్లాడారు. యూరప్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలయ్యే ప్రమాదముందని డేవిడ్‌ అన్నారు. ఈసారి పరిస్థితి ఊహించలేనంత దారుణంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

యూరప్‌ దేశాలు కరోనా ఫస్ట్‌ వేవ్ ను  త్వరగానే తగ్గించేశాయి. వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అదుపు చేశాయి. ఆ తర్వాత కరోనా నివారణకు వేసవి రూపంలో మంచి అవకాశం వచ్చినా యూరప్‌ దేశాలు ఉపయోగించుకోలేకపోయాయని ,  ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌లోనూ మేల్కోకపోతే థర్డ్‌ వేవ్‌ మరింత భీకరంగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలని, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. దక్షిణ కొరియా లాంటి ఆసియా దేశాలు కరోనా వ్యాప్తి నియంత్రించడంలో విజయం సాధించాయని డేవిడ్‌ ప్రశంసించారు. అక్కడ అత్యంత తక్కువ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేశారు.

ఇక దేశంలో గత 24 గంటల్లో  37,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 91,77,840కి చేరింది. నిన్న కొత్తగా 480 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,34,218కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.  ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా, రష్యా, ఇటలీ, బ్రెజిల్ ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Tags:    

Similar News