డిసెంబరు 1 నుంచి కర్ఫ్యూ తప్పదా?

Update: 2020-11-26 05:15 GMT
ప్రపంచంలోని పలు దేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. డిసెంబరు ఒకటి నుంచి రాత్రివేళల్లో కర్ఫ్యూ విధించేందుకు వీలుగా రాష్ట్రాలకు మార్గదర్శకాల్ని జారీ చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. డిసెంబరు 31 వరకు అమల్లో ఉండే మార్గదర్శకాల్ని తాజాగా విడుదల చేసింది. శీతాకాలంలో ప్రారంభమై.. తీవ్రత పెరుగుతున్న వేళ.. కోవిడ్ కేసులు పెరగటానికి అవకాశాలు ఉండటంతో కేంద్రం రంగంలోకి దిగింది. రాష్ట్రాలకు తాజాగా మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఇందులో కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి.

ఇప్పటికే ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలువుతున్నాయి. దేశ వ్యాప్తంగా అమలు చేయటానికి వీలుగా మార్గదర్శకాల్ని విడుదల చేశారు. ఇందులో ప్రధానమైనది రాత్రిళ్లు.. కర్ఫ్యూను విధించటం. అయితే.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. కంటోన్మెంట్ జోన్ బయట.. లాక్ డౌన్ విధించాలనుకుంటే మాత్రం కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది.

మాస్కులు ధరించటం..భౌతికదూరం పాటించటం.. చేతుల్ని శుభ్రంగా కడుక్కోవటం లాంటి నిబంధనల్నికఠినంగా అమలు చేయాలని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని వారికి తగిన జరిమానా విధించాలని తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్ని స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు.. వైరస్ వ్యాప్తికి కారణమైన వారి విషయంలోనూ చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

మరి.. ముఖ్యంగా ఆఫీసుల్లో మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించాలని అధికారుల్ని ఆదేశించింది. ఆరోగ్య సేతు యాప్ ను విధిగా అందరూ వినియోగించాలన్న ప్రభుత్వం.. కంటైన్మెంట్ జోన్ వెలుపల సినిమా హాళ్లు యాభై శాతం సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటం తెలిసిందే. అయితే.. స్విమ్మింగ్ ఫూల్స్ అనుమతిని క్రీడాకారుల శిక్షణ నిమిత్తం మాత్రమే ఇవ్వటం గమనార్హం.

పాజిటివ్ కేసును గుర్తించిన తర్వాత వారితో కాంటాక్ట్ లోకి వచ్చిన వారి వివరాల్ని సేకరించాలని.. వారిని గుర్తించి.. క్వారంటైన్ చేయటం లాంటివి 72 గంటల్లో కనీసం 80 శాతం పూర్తి చేయాలన్న సూచన చేసింది. వారంలో పాజిటివ్ కేసులు పదిశాతానికి మించితే.. ఆఫీసులకు హాజరయ్యే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు..సామాజిక దూరాన్ని పాటించేందుకు వీలుగా ఆఫీసు టైమింగ్స్ ను మార్చాలని కేంద్రం స్పష్టం చేసింది. సో.. రాత్రిళ్లు కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది. అయితే.. అందుకు నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఆయా రాష్ట్రాలే అన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News