హే గాంధీ.. ఎప్పటికి మారేను? వణికే దారుణం ఏమంటే?

Update: 2020-07-15 05:15 GMT
తెలంగాణలో పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా సుపరిచితమైన గాంధీ ఆసుపత్రిలో దారుణాల పరంపర కొనసాగుతూనే ఉంది. కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా వైద్యసేవల్ని అందిస్తుందన్న మాట కొందరి నోట వినిపిస్తున్నా.. మరికొందరు మాత్రం విమర్శిస్తూ ఉండే పరిస్థితి. అప్పుడప్పుడు బయటకు వస్తున్న కొన్ని అంశాలు.. గాంధీ మీద మరకల్ని పడేలా చేస్తుంది. వాటిని చెరిపేసుకునే విషయంలో ఆ పెద్దాసుపత్రి కిందామీదా పడుతున్న పరిస్థితి.
ఆ మధ్యన వ్యర్థాల తొలగింపు.. చనిపోయిన ఒకరికి బదులుగా మరొకరిని బాధితుల కుటుంబాలకు ఇవ్వటం.. ఇలా చెప్పుకుంటూ గాంధీ మీద వచ్చిన విమర్శల చిట్టా పెద్దదిగానే ఉంటుంది. తాజాగా చోటు చేసుకున్న దారుణం వింటే వణకాల్సిందే. కరోనా పాజిటివ్ తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఒక రోగి మరణించాడు. అతడి మృతదేహం బెడ్ మీద ఉన్నప్పటికీ.. దాన్ని తరలించే విషయంలో అంతులేని నిర్లక్ష్యం చోటు చేసుకున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శ్రీనివాస్ అనే కరోనా రోగి మంగళవారం గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. సాధారణంగా ఎవరైనా రోగి మరణించిన వెంటనే.. ఆ మృతదేహాన్ని తరలిస్తారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి..వారికి అప్పజెబుతారు. తాజా ఉదంతంలో.. రోగి మరణించిన తర్వాత ఎనిమిది గంటల వరకూ ఆ మృతదేహాన్ని అలానే ఉంచేశారు. దీంతో.. దుర్వాసనతో కరోనా వార్డు మొత్తం కంపు కొట్టే పరిస్థితి.

ఈ దుర్వాసన భరించలేనిదిగా మారింది. దీంతో.. సదరు వార్డులో ఉన్న రోగులు.. వైద్యులు.. వైద్య సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మృతదేహాన్ని తరలించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదని చెబుతున్నారు. దీంతో.. భరించలేని పరిస్థితుల్లో సదరు వార్డులో ఉన్న పేషెంట్లు వార్డును ఖాళీ చేసి వేరే వార్డుకు వెళ్లిపోయారు. మరి..గాంధీలో ఉన్న అంతమంది సిబ్బంది ఏం చేస్తున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News