శభాష్ కేటీఆర్.. ఫర్లేదే ఆర్నెల్ల తర్వాత భలే సందేశం ఇచ్చారుగా?

Update: 2020-08-10 07:50 GMT
ఓపక్క పెరిగే కేసులు. మరోపక్క ప్రభుత్వ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు. ఆసుపత్రిలో బెడ్ల కోసం గంటల తరబడి తిరిగినా లభించని దుస్థితిలో ఎంతోమంది మరణించటం.. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినంతనే లక్షలాది రూపాయిలతో బిల్లులు వాయించేస్తున్న వైనంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. అధినేత నోరు విప్పరు.. యువనేత పట్టనట్లు ఉంటారన్న భావన ప్రజల్లో అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. మంత్రి కేటీఆర్ భలేగా నోరు విప్పారు.

కరోనా యుద్ధంలో ప్రజలంతా ప్రభుత్వంతో కలిసి రావాలని.. సర్కారు మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదని.. ప్రజలు భయం.. దుష్ప్రచారాల్ని వదిలి కోవిడ్ ను ఎదుర్కోవాలంటూ ఇచ్చిన ఆయన సందేశం చూస్తే.. అదరగొట్టేశారుగా అనిపించక మానదు. కోవిడ్ సవాలును స్వీకరించటంతో మొదట్లో తనకు తాను తిరుగులేనట్లుగా వ్యవహరించిన తెలంగాణ సర్కారు..ఆ టెంపోను కొనసాగించటంలో బొక్కబోర్లా పడిందన్న మాట అంతకంతకూ పెరిగిపోవటం తెలిసిందే.

కరోనా నిర్దారణ పరీక్షలు జరిపించండి మహాప్రభూ అని నెత్తినోరు కొట్టుకున్నా పట్టనట్లుగా వ్యవహరించి.. చివరకు కోర్టు కల్పించుకుంటే తప్పించి స్పందించని వైనానికి సమాధానం చెప్పని కేటీఆర్.. కోవిడ్ కేసులు.. కరోనా కారణంగా మరణించిన వారి వివరాల్ని రాష్ట్ర ప్రభుత్వం దాచి పెడుతోందన్న ఆరోపణల్ని అబద్ధాలు.. నిరాధారమైనవిగా కొట్టి పారేయటం చూస్తే.. తన మాటల చాతుర్యాన్ని కేటీఆర్ మరోసారి చక్కగా ఆవిష్కరించారని చెప్పక తప్పదు. కరోనా లెక్కలకు సంబంధించిన వివరాల్ని.. సమగ్రంగా ఇవ్వండి సారూ అన్నప్పటికీ ఇచ్చేందుకు ససేమిరా అన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. కోర్టు నుంచి అదే పనిగా మొట్టికాయలు పడిన తర్వాత మాత్రమే.. కాసిన్ని వివరాలైనా ఇస్తున్నారన్నది మర్చిపోకూడదు.

ఈ రోజుకి ఏ రోజున ఎంతమంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చనిపోతున్నారు? అన్న లెక్క చెప్పని పరిస్థితి. తమిళనాడు.. కర్ణాటక.. కేరళ రాష్ట్రాల్లో మరణించిన వారి పేర్లు..చిరునామాలు మినహాయించి.. వారే కారణంతో మరణించారన్న విషయాన్ని కేసుల వారీగా ఇవ్వటం చూసినప్పుడు.. అలాంటి సమగ్రత తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుందన్న ప్రశ్నకు సమాధానం దొరకని దుస్థితి. ఇక.. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ మీద ఎన్నో సాక్ష్యాలతో మీడియాలో కథనాలు వచ్చినా రెండు ఆసుపత్రుల మీద చర్యలు తప్పంచి.. కొరడా విదల్చలేని పరిస్థితి ఎందుకు ఉందన్న విషయాన్ని కేటీఆర్ చెప్పలేకపోతున్నారు.

అంతెందుకు.. ఆసుపత్రుల తీరుపై తమ వద్ద వందకు పైగా ఫిర్యాదులు ఉన్నట్లుగా సాక్ష్యాత్తు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ మాటల్లో చెప్పటమే కానీ.. చర్యలు తీసుకోకపోవటాన్ని ఏమని చెప్పాలి. ఇదంతా ఇప్పడు ఎందుకు ప్రస్తావిస్తున్నారంటారా? కేటీఆర్ ఆదివారం సాయంత్రం వేళలో.. ఆస్క్ మీ కేటీఆర్ అంటూ సోషల్ మీడియా వేదిక మీదగా పలువురు నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన కరోనా మీద.. ప్రజలంతా ప్రభుత్వం చేసే కరోనా యుద్ధంలో తోడు ఉండాలన్న పిలుపు ఇచ్చారు. గడిచిన ఆర్నెల్లుగా ప్రభుత్వం వెంటే ప్రజలు ఉన్నారు. బ్యాడ్ లక్ ఏమంటే.. ప్రజల వెంటే ప్రభుత్వం లేదన్న అసలు విషయాన్ని కేటీఆర్ మిస్ కావటం మర్చిపోకూడదు.

ఆక్సిజన్ అందక చనిపోయినోడు కానీ.. ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి వైద్యం అందక అంబులెన్సులో మరణించటం కానీ.. గాంధీ.. కింగ్ కోఠి లాంటి ఆసుపత్రులకు వెళ్లి.. ఇక్కడ కాదు.. అక్కడికి వెళ్లాలంటూ తిప్పి పంపే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నోళ్లు ఎందరో. అలాంటివి మర్చిపోయి.. ప్రజలు ప్రభుత్వం వెంట కలిసి రావాలన్న కేటీఆర్ స్టేట్ మెంట్ చూస్తే.. ఏం సెబితిరా చిన్నసారు అనటం తప్పించి.. ఇంకేం అనగలం చెప్పండి?
Tags:    

Similar News