కాలికి ముల్లు గుచ్చుకుంటే మీ పంటితో తీసే సారు.. కరోనా వేళ లక్ష మందితో సభేంది?

Update: 2021-04-14 04:30 GMT
మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే.. నా పంటితో తీస్తా.. అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పట్లో అన్న మాటల్ని విన్న వారంతా తెగ ఖుషీ అయిపోయారు. ప్రజల కోసం.. వారి బాధల్ని అర్థం చేసుకునే సున్నిత మనస్కుడు పాలకుడిగా మారటం తాము చేసుకున్న  అదృష్టంగా భావించిన వారెందరో. అలాంటి కేసీఆర్.. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో లక్ష మందితో భారీ సభను ఏర్పాటు చేయటాన్ని ఎలా చూడాలి? ఏమని అర్థం చేసుకోవాలి?

నిజానికి సాగర్ ఉప ఎన్నికను అంత సీరియస్ గా తీసుకోవాలా? అంటే.. బరాబర్ తీసుకోవాల్సిందేనని టీఆర్ఎస్ నేతలు ఎవరైనా చెబుతారు. కానీ.. దానికి మూల్యం కొన్ని లక్షల మంది ఆరోగ్యం అంటే.. అంతకు మించిన దారుణం ఏముంటుంది? నిజానికి సెకండ్ వేవ్ నేపథ్యంలో.. కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు.. ఉప ఎన్నికను సింఫుల్ గా పూర్తి చేద్దామని.. అఖిల పక్షం ఏర్పాటు చేసి ఉంటే ఎలా ఉండేది?

ఉప ఎన్నిక నిర్వహించాలి. కానీ.. ప్రచారం చాలా పరిమితంగా చేపట్టటం. గెలుపు ఓటముల కంటే కూడా ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యమన్న విషయానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి.. ఇదే విషయాన్ని పిలుపునిచ్చి ఉంటే.. తెలంగాణలోని రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించేవి. ఒకవేళ.. ఇప్పుడు నిర్వహిస్తున్న విధానానికి పూర్తి భిన్నంగా.. కరోనా వేళలో ఎన్నికలు నిర్వహించాల్సిన విధానం ఎలా ఉండాలన్న విషయానికి రోల్ మోడల్ గా నిలిచి ఉంటే ఎంత బాగుండేది?

కారణం ఏమైనా.. ఒకప్పుడు స్వతంత్రంగా వ్యవహరించే వ్యవస్థల్లో చాలావరకు.. ఇప్పుడు అధికారానికి కట్టుబానిసలుగా మారిపోయాయి. అవేమిటన్న చర్చను పక్కన పెడితే.. ఇవాల్టి రోజున దేశంలో కనిపిస్తున్న అనేక దరిద్రాలకు ఇదో ముఖ్య కారణంగా చెప్పక తప్పదు. ఉప ఎన్నికలో గెలుపు కోసం లక్ష మందితో బహిరంగ సభను నిర్వహించటం అంటే.. అదెంతో ప్రమాదకరమన్నది మర్చిపోకూదు. రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టటం ప్రజా ప్రభుత్వాలకు ఏ మాత్రం సరైనది కాదు. ఈ విషయాన్ని సున్నిత మనస్కుడిగా చెప్పే కేసీఆర్ ఎందుకు గుర్తించటం లేదు? రాజకీయ అధిక్యతల ముందు మిగిలిన అంశాలు చిన్నవి అవుతాయా? అదే నిజమైతే.. అంతకు మించిన బ్యాడ్ లక్ మరొకటి ఉండదు.
Tags:    

Similar News