క‌రోనా లేదు గిరోనా లేదు.. ఫీజు క‌ట్టాల్సిందే..! నోరెత్తని సర్కారు!

Update: 2021-04-17 10:30 GMT
ఈ విద్యాసంవత్స‌రంలో తెలంగాణ‌లో జ‌రిగిన త‌ర‌గతులు ఎన్ని? అంటే.. ఒక స్ప‌ష్ట‌మైన రికార్డు క‌నిపించ‌దు. ఎండాకాలం చ‌దువుల‌క‌న్నా అద్వాన్నంగా సాగాయి పాఠాలు. త‌ర‌గ‌తి గ‌దిలో ఎదురుగా టీచ‌ర్ ఉంటేనే.. క‌ష్టంగా ముగుస్తుంది పిరియ‌డ్‌. అలాంటిది.. ఆన్ లైన్ త‌ర‌గుతులు అని ఒక పేరు పెట్టి.. ఏదో పాఠాలు చెప్పామంటే చెప్పాం అన్న‌ట్టుగానే సాగించార‌నేది చాలా మంది పేరెంట్స్ ఫిర్యాదు.

స‌గం విద్యాసంవ‌త్స‌రం అలా గ‌డిచిపోయిన త‌ర్వాత‌ పాఠ‌శాల‌లు తెరుచుకున్నా.. ముచ్చ‌టగా మూణ్నెళ్లు కూడా స‌రిగా న‌డ‌వ‌లేదు. కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభించ‌డంతో మ‌ళ్లీ మూతేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. తాజాగా..  ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు కూడా ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అయితే.. ఇప్పుడు పాఠ‌శాల‌ల వాద‌న ఏమంటే.. టెన్త్ ప‌రీక్షలు మాత్ర‌మే ర‌ద్ద‌య్యాయని, మిగిలిన త‌ర‌గ‌తులకు తాము ప‌రీక్ష‌లు పెడ‌తామ‌ని చెబుతున్నాయ‌ట‌.

అయితే.. ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామ‌ని, అప్పుడే ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తి ఇస్తామ‌ని చెబుతున్నాయ‌ట‌. దీనిపై త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అతి ముఖ్య‌మైన టెన్త్ ప‌రీక్ష‌లే ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన‌ప్పుడు.. మిగిలిన త‌ర‌గ‌తుల‌కు ప‌రీక్ష‌లు ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం డ‌బ్బులు గుంజేందుకు కార్పొరేట్ విద్యాసంస్థ‌లు ప‌రీక్ష‌ల పేరుతో నాట‌కాలు ఆడుతున్నాయ‌ని మండిప‌డుతున్నారు.

ఇక‌, టెన్త్ విద్యార్థులను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌భుత్వం టెన్త్ ప‌రీక్ష‌లను ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో ఇంట‌ర్నల్‌ మార్కుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి.. ఫీజులు మొత్తం చెల్లిస్తేనే ఆ మార్కులు బోర్డుకు పంపిస్తామ‌ని, లేదంటే.. ఆపేస్తామ‌ని బెదిరిస్తున్నాయ‌ట యాజ‌మాన్యాలు.

అస‌లు పాఠ‌శాల‌లో ఎన్ని త‌ర‌గ‌తులు న‌డిచాయి? ఎంత మంది టీచ‌ర్లు ఉన్నారు? ఎంత మందిని తొల‌గించారు? ఇలాంటి వివ‌రాలు ఏవీ విద్యాశాఖ ప‌ట్టించుకోవ‌ట్లేద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క‌మ‌వుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. త‌ల్లిదండ్రుల నుంచి ఫీజులు మాత్రం భారీగా వ‌సూళ్లు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈ దోపిడీపై ప్ర‌భుత్వం స్పందించాల‌ని, త‌మ‌ను కాపాడాల‌నిన పేరెంట్స్ వేడుకుంటున్నారు. మ‌రి, స‌ర్కారు ఏమేర‌కు స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News