తెలంగాణ త‌ప్ప‌.. దేశంలో అన్ని రాష్ట్రాలూ లాక్‌డౌన్‌!

Update: 2021-05-10 08:30 GMT
దేశంలో క‌రోనా కోరులు చాచి.. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను, ప్ర‌భుత్వాల ప‌నిత‌నాన్ని హ‌రిస్తున్న నేప‌థ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు త‌మ ప్ర‌జ‌ల‌ను కాపాడుకునేందుకు.. లాక్‌డౌన్ విధిస్తున్నాయి. దేశ రాజ‌ధాని డిల్లీ నుంచి దాదాపు అన్ని రాష్ట్రాలు(తెలంగాణ త‌ప్ప‌) కూడా సంపూర్ణ‌, లేదా పాక్షిక లాక్‌డౌన్ విధించి.. ప్ర‌జ‌ల ప్రాణాలు ర‌క్షించుకునేందుకు, ఆసుప‌త్రుల‌పై ఒత్తిడి త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు.

ఢిల్లీలో కేసులు , మృతులు పెరిగిపోవ‌డంతో అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌భుత్వం గ‌త ఏప్రిల్ 19వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు దీనిని పెంచుతోంది. ఈ క్ర‌మంలో మే 10వ తేదీ వ‌ర‌కు ఇటీవ‌ల పొడిగించారు. ఈ వ‌రుస‌లోనే మ‌హారాష్ట్ర స‌ర్కారు కూడా మే 15వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింది. గ‌త నెల నుంచి లాక్‌డౌన్‌ను పాక్షికంగా అమ‌లు చేస్తున్న మ‌హారాష్ట్ర.. రాష్ట్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు లాక్‌డౌన్ పొడిగించారు.

ఇక, ఇక్క‌డ ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సింది.. తెలంగాణ గురించి. ఇక్క‌డ కేసులు పెరుగుతున్నా.. మ‌ర‌ణాలు పెరుగుతున్నా కూడా లాక్‌డౌన్ విధించే ప్ర‌స‌క్తి లేద‌ని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప‌దే ప‌దే చెబుతున్నారు. ఇటీవ‌ల కూడా ఆయ‌న లాక్‌డౌన్‌పై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. నోలాక్‌డౌన్‌.. అని తేల్చి చెప్పారు. లాక్‌డౌన్ కార‌ణంగా.. ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని.. అంచ‌నా వేస్తున్న‌ట్టు తెలిపారు.

అంతేకాదు.. కేసీఆర్ మ‌రో కీల‌క విష‌యం కూడా చెప్పారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసుకుంటే.. మే 15 నాటికి క‌రోనా సెకండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌డుతుంద‌నే అంచ‌నా ఉంద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం తెలంగాణలో ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చి 2,50,000-300000 మంది కార్మికులు ప‌నిచేస్తున్నార‌ని.. లాక్‌డౌన్ పెడితే.. వీరంతా ఇబ్బంది ప‌డ‌తార‌ని.. గ‌త ఏడాది ఇదే ప‌రిస్థితి త‌లెత్తింద‌ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు.

 ఇక‌, మ‌రో తెలుగు రాష్ట్రం ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ పాక్షిక లాక్‌డౌన్ అమ‌ల‌వుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద‌యం 6-12 గంట‌ల మ‌ధ్య మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు అనుమ‌తులు ఇస్తున్నారు. మిగిలి స‌మ‌యంలో అంటే.. దాదాపు 18 గంట‌ల పాటు.. రాష్ట్రంలో క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. ఇది మే 18 వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నుంది. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌, యూపీ, హ‌రియాణ‌, బిహార్‌, ఒడిశా, జార్ఖండ్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌ల్లో పాక్షిక‌ లాక్‌డౌన్‌ను విధించారు. ఇక‌, గుజ‌రాత్‌, జ‌మ్ము క‌శ్మీర్‌ల‌లోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది.

ప్ర‌స్తుతం దేశంలో రోజుకు 4 వేల మంది మృతి చెందుతున్నారు. అదేస‌మ‌యంలో 4 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనా చైన్‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ అస్త్రాన్ని గ‌ట్టిగా అమ‌లు చేస్తుండ‌గా.. కేసీఆర్‌.. మాత్రం ఆర్థిక మంత్రం ప‌ఠిస్తున్నార‌నే.. వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News