వైద్యానికి హైదరాబాద్ కు వస్తున్నారా? తెలంగాణ సర్కారు తాజా మార్గదర్శకమిదే

Update: 2021-05-14 05:30 GMT
అవును.. హైదరాబాద్ కు ఇప్పుడు అందరూ రాలేరు. అందునా కోవిడ్ వైద్యం కోసం అంబులెన్సులు వేసుకొని.. వాహనాల్లో భాగ్యనగరికి వచ్చేస్తామంటూ సాధ్యం కాదని చెబుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ హైకోర్టు ఆదేశాల్ని తూచా తప్పకుండానే.. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి తెలంగాణ రాష్ట్ర సర్కారు తాజాగా సరికొత్త మార్గదర్శకాల్ని సిద్ధం చేసింది. వైద్యం కోసం వచ్చే వారు ముందస్తుగా అనుమతిని తప్పనిసరి చేశారు.

తెలంగాణకు చుట్టుపక్కల రాష్ట్రాలైన ఆంధ్రా.. కర్ణాటక.. తమిళనాడు.. మహారాష్ట్రల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉండిపోవటంతో.. వైద్య సౌకర్యాల కోసం హైదరాబాద్ బాట పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో.. హైదరాబాద్ లోని ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో కొవిడ్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోవటంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సుల్ని ఆపేసి.. వెనక్కి పంపారు. ఈ ఉదంతంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అత్యవసర వైద్యం కోసం వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు కొత్త మార్గదర్శకాల్ని సిద్ధం చేసింది. దీని ప్రకారం.. రాష్ట్రంలోకి వచ్చే వారు.. అందునా వైద్య సదుపాయం కోసం వచ్చేవారు.. సంబంధిత ఆసుపత్రి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. 040-2465119.. 9494438351 నంబర్లకు ఫోన్ చేసి.. ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతిస్తారని చెబుతున్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వారి సంఖ్యను అదుపు చేయని పక్షంలో.. హైదరాబాద్ లోని బాధితులు తీవ్ర అవస్థలకు గురి కావాల్సిన దుస్థితి నెలకొందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News