లోకేష్ క‌నుస‌న్న‌ల్లోనే డేటా స్కాం!

Update: 2019-03-05 13:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌరుల వ్య‌క్తిగ‌త గోప్య‌త‌ను న‌డి బ‌జార్లో పెట్టింది ఐటీ గ్రిడ్స్. ఈ డేటా చౌర్యం చోటుచేసుకున్న‌ తీరుపై రాష్ట్ర ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కేసును త‌వ్వే కొద్దీ సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ప్ర‌భుత్వంలోనే పెద్ద‌ల స‌హ‌కారంతోనే ఐటీ గ్రిడ్స్ పౌరుల స‌మాచార దొంగిలింత సాహ‌సానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో ప్ర‌ధానంగా వినిపిస్తున్న పేరు నారా లోకేష్‌.

లోకేష్ ప్ర‌స్తుతం మంత్రి ప‌దవిలో ఉన్నారు. ఆయ‌న స్వ‌యానా సీఎం కుమారుడు. కాబ‌ట్టి ప్ర‌భుత్వంలో ఆయ‌న మాట‌కు తిరుగులేదు. అధికారుల‌కు ఆయ‌న మాటే శాస‌నం. దీంతో టీడీపీకి ప్ర‌యోజ‌నం చేకూర్చేలా లోకేష్ త‌న క‌నుస‌న్న‌ల్లోనే డేటా చౌర్యం జ‌రిపించార‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ తో లోకేష్ స‌న్నిహిత సంబంధాలు ఈ ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుస్తున్నాయి. ఐటీ గ్రిడ్స్ కార్యాల‌యాల్లో సోదాల‌ను అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు ప‌రుగు ప‌రుగున హైద‌రాబాద్ వెళ్ల‌డం కూడా ఇక్క‌డ గ‌మ‌నార్హ‌మైన విష‌య‌మే.

ఏపీలో డేటా చౌర్యం రెండు మూడేళ్లుగా న‌డుస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తేడాది కొంద‌రు వ్య‌క్తులు స‌ర్వేల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించారు. ల్యాప్ టాపుల్లో ఓట‌ర్ల వివ‌రాలు న‌మోదు చేసుకున్నారు. వారంద‌రి ద‌గ్గ‌ర కామ‌న్ గా ఉన్నదేంటంటే.. మంత్రి నారా లోకేష్ తో క‌లిసి దిగిన ఫొటో. వాస్త‌వానికి స‌ర్వేలో పేరుతో ఏదో మాయ చేస్తున్నారంటూ ప్ర‌తిప‌క్ష పార్టీలు అప్ప‌ట్లోనే ఆరోపించాయి. ఆయా జిల్లాల్లో విప‌క్ష నేత‌లు పోలీసులు బూట‌క‌పు స‌ర్వేలపై ఫిర్యాదు కూడా చేశారు. విచిత్ర‌మేంటంటే ఏ ఒక్క జిల్లాలోనూ పోలీసులు ఆ స‌ర్వే రాయుళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకోలేదు. స‌గౌర‌వంగా వారిని స్టేష‌న్ నుంచి సాగ‌నంపారు. కేసుల‌ను నీరుగార్చారు.

నాటి గుట్టంతా ఐటీ గ్రిడ్స్ కేసుతో ఇప్పుడు బ‌ట్ట బ‌య‌లైంది. నాడు ఊరూరా ప‌ర్య‌టించింది ఈ సంస్థ వాళ్లేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. స‌ర్వేరాయుళ్లంద‌రి వ‌ద్ద లోకేష్ తో క‌లిసి దిగిన ఫొటోలు ఉండ‌టం బ‌ట్టి చూస్తే.. స‌ర్వే ఆరంభానికి ముందు వారంద‌రితో మంత్రి స‌మావేశ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. అప్పుడే వారితో ఫొటోల‌కు పోజులిచ్చార‌ని అర్థ‌మ‌వుతోంది. ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యం వ్య‌వ‌హారంలో త‌న ప్ర‌మేయం బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డం వ‌ల్లే ఇప్పుడు లోకేష్ నోరు మెద‌ప‌డం లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags:    

Similar News