‘డాన్’ దమ్ము భారత మీడియాకేం చెబుతోంది?

Update: 2016-10-16 05:33 GMT
మిగిలిన దేశాల సంగతేమో కానీ.. ఇప్పుడు చెప్పే విషయం ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛా భారతం అంటూ పలువురు అభివర్ణిస్తున్నా.. రేఖామాత్రంగా కనిపించీ.. కనిపించని రీతిలో ఉండే ఆంక్షలు భారత మీడియాపై ఇప్పటి రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిని తమకు తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం వచ్చేసినట్లే. స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పటమే కాదు.. ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపే ధోరణి భారత్ లో ఎక్కువన్నట్లుగా చెప్పినా.. అదంతా.. పాకిస్థాన్ లోని ప్రముఖ మీడియా సంస్థ.. ‘డాన్’కు ఉన్నంత ఉన్నదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

పాక్ లాంటి దేశంలో.. పాక్ ప్రభుత్వానికి.. ఆర్మీకి వ్యతిరేకంగా కొన్ని నిజాల్ని రాయాల్సి వస్తే.. ఆ దేశంలోని మీడియా సంస్థ ఏం చేస్తుంది? అన్న ప్రశ్న వేస్తే.. వెనక్కి తగ్గుతుందన్న మాట టుక్కున వస్తుంది. కానీ.. డాన్ మాత్రం అలాంటి పని చేయలేదు. భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో.. పాక్ సర్కారుకు.. పాక్ ఆర్మీకి మధ్య పెరిగిన అంతరాన్ని తన మొదటి పేజీలో సంచలన కథనంగా అచ్చేసింది.

తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో ఈ తరహా వార్తలు అచ్చేసేందుకు ధైర్యం ఎంతో అవసరం. పాత్రికేయానికి వాస్తవం ఒక్కటి మాత్రమే ప్రామాణికమని.. మరే ఇతర అంశాలు పరిగణన‌లోకి తీసుకోవాల్సిన అవసరం లేదని.. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా నిజం చెప్పాల్సి వస్తే.. అదెంత నిష్ఠూరంగా ఉన్నా వాస్తవం వెల్లడించాల్సిందే. సరిగ్గా ఈ సూత్రాన్నే నమ్మినట్లుగా డాన్ పత్రిక కనిపిస్తోంది. తన దృష్టికి వచ్చిన సర్కారు.. సైన్యం పంచాయితీని ప్రముఖంగా ప్రచురించింది. దీనిపై పాక్ సర్కారు సీరియస్ అయ్యింది. తన ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసేలా వార్తను అచ్చేసిన డాన్ మీద నిప్పులు చెరిగింది.

ఈ వార్తను రాసిన ప్రముఖ జర్నలిస్ట్ సైరల్ అల్ మైదాను విదేశాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించటమే కాదు.. తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. వీటిని పెద్దగా పట్టించుకోని డాన్.. తాము నమ్మిన నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. ప్రజా మద్దతు కోసం ప్రయత్నించింది. అనూహ్యంగా డాన్ కు ప్రజా మద్ధతు భారీగా  రావటమే కాదు.. మేధావి వర్గాలు.. ఇతర మీడియా సంస్థలు డాన్  తరఫున నిలిచాయి. దీంతో.. నవాజ్ సర్కారు వెనక్కి తగ్గక తప్పలేదు. డాన్ జర్నలిస్ట్ సైరల్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

చిన్న చిన్న అంశాల విషయంలోనూ అధికారపక్షానికి అండగా నిలుస్తూ.. వారిపై ఏ మాత్రం విమర్శలు గుప్పించినా.. అదేదో మహాపరాధంగా మారినట్లుగా ప్రచారం జరుగుతున్న వర్తమానంలో.. అలాంటి వాటి జోలికి వెళ్లకుండా.. పైపైన వార్తలు రాసేస్తున్న కొన్ని రాష్ట్రాల్లోని మీడియా సంస్థలు.. పాక్ మీడియా సంస్థ డాన్ తాజా ఎపిసోడ్ ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సత్యం ముందు ఎవరైనా.. ఎంతటి వారైనా తలొగ్గాల్సిందనని.. ఆ సత్యాన్ని చెప్పే క్రమంలో శతభిషలు అస్సలు పనికి రావన్న విషయాన్ని డాన్ స్పష్టం చేసింది. సర్కారుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్న దేశంలోని కొన్ని మీడియా సంస్థలు.. ఇప్పటికైనా తాము చేయాల్సిన పనిని.. ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News