ఢిల్లీ అల్లర్లు : 42కి చేరిన మృతుల సంఖ్య , కోలుకుంటున్న ఈశాన్య ఢిల్లీ ..

Update: 2020-02-29 06:15 GMT
గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన అల్లర్లు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే , శుక్రవారం మాత్రం , ఆ అల్లర్ల ప్రభావం అంతగా కనిపించలేదు. ఢిల్లీ లో విధించిన కర్ఫ్యూను కూడా కొన్ని గంటల పాటు తొలగించడంతో .. ఇళ్లల్లో నుండి ప్రజలు బయటకి వచ్చి తమ పనులలో బిజీ అయ్యారు. శుక్రవారం కావడంతో ముస్లింల ప్రార్థనలు కూడా ప్రశాంతంగా సాగాయి. వదంతులకు, తప్పుడు వార్తలకు స్పందించవద్దని పోలీసులు కోరారు. పోలీసులు, పారా మిలటరీ దళాలు ఢిల్లీ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ని చాలా నిశితం గా పరిశీలిస్తున్నాయి.

ఇకపోతే ఈశాన్య ఢిల్లీ లో జరిగిన అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య 42 కి చేరింది. అల్లర్లో తీవ్రంగా గాయపడి గురు తేజ్‌ బహదూర్ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్నవారిలో మరో నలుగురు శుక్రవారం మృతి చెందారు. ఇప్పటి వరకు అల్లర్లకు సంబంధించి పోలీసులు 148 ఎఫ్‌ ఐఆర్‌ లను నమోదు చేశారు. అలాగే దాదాపు 630 మందిని అరెస్ట్‌ చేసారు. చనిపోయిన వారిలో ఐబి ఆఫీసర్ అంకిత్ శర్మ కూడా ఒకరు. ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ హత్య కేసు లో ప్రధాన నిందితుడి గా పేర్కొన్న ఆప్ కౌన్సెలర్ తాహీర్ హుస్సేన్‌ కోసం పోలీసులు ముమ్మరం గా తనిఖీ చేస్తున్నారు. తాహిర్ మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అప్ , తాహిర్ ని పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు, అంకిత్ శర్మ మృతదేహం లభ్యమైన మురికి కాలువ సమీపంలో సిట్, ఫోరెన్సిక్ బృందం ఆధారాల కోసం వెదుకుతున్నారు. శర్మను హత్య చేసిన తర్వాత మురికి కాలువ లో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం నుంచి ఇప్పటి వరకు 38 మంది మృతి చెందగా వీరిలో 16 మందిని గుర్తించామని, మరో 12 మంది ఎవరనేది ఇంకా తెలియలేదని హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు.

కాగా , ప్రస్తుతం వందకు పైగా క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రుల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరికి బుల్లెట్‌ గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 9 ప్రాంతాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ బాధితులకు ఆహారం అందిస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి రూ. 25 వేల చొప్పున అందజేస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు.
Tags:    

Similar News