అవి రెండు మహా నగరాలు..ఒకటి దేశానికి రాజధాని కాగా - మరొకటి ఆర్థిక రాజధాని. ఒక ప్రాంతం నుంచి మరొకటి సుదూరంలో ఉన్నప్పటికీ...ఆ నగరాలు దాదాపుగా ఒకే రకమైన సమస్యతో సతమతం అవుతున్నాయి. ఆ రెండు నగరాలే రాజధాని ఢిల్లీ...ఆర్థిక రాజధాని ముంబై. ఇక్కడి ప్రజల పరిస్థితిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలకుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చెత్త కుప్పల మధ్య ఢిల్లీ నగరం సమాధి అవుతున్నా - వరద నీటితో ముంబై మునిగిపోతున్నా ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదని సుప్రీంకోర్టు మంగళవారం ఆవేదన వ్యక్తం చేసింది. ఘన వ్యర్థాల యాజమాన్య విధానాల అమలుపై అఫిడవిట్లు దాఖలు చేయని 10 రాష్ట్ర ప్రభుత్వాలు - రెండు కేంద్ర పాలిత ప్రాంతాలపై రూ. లక్ష చొప్పున జరిమాన విధించింది.
వ్యర్థాల నిర్వహణ విషయంలో ఆయా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోకపోతుండటంతో దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వీకరించింది. పరిపాలనా వ్యవహారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే న్యాయ వ్యవస్థ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నదంటూ న్యాయమూర్తులపై దాడి చేస్తారని జస్టిస్ లు ఎంబీ లోకూర్ - దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏమీచేయలేకపోతే తామేం చేయగలమని ప్రశ్నించింది. ఘన వ్యర్థాల నిర్వహణ వ్యూహాన్ని ఇంకా ఖరారు చేయని 13 రాష్ర్టాలు - ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమాన విధించిన రాష్ర్టాల్లో బీహార్ - ఛత్తీస్ గఢ్ - గోవా - హిమాచల్ ప్రదేశ్ - జమ్ముకశ్మీర్ - పశ్చిమబెంగాల్ - కేరళ - కర్ణాటక - మేఘాలయ - పంజాబ్ - కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీప్ - పుదుచ్చేరి ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి పట్ల న్యాయస్థానం నిస్సహాయత వ్యక్తం చేసి ప్రజల జీవితాలను మార్చేందుకు పాలకులు పనిచేయాలని కోరింది.
కాగా, కుండపోత వానలు ముంబై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముంబై చుట్టు పక్కల ప్రాంతాలపై సైతం తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వరుసగా నాలుగోరోజు మంగళవారం కూడా భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలపై వర్షపు నీరు నిలువడంతో పశ్చిమ రైల్వేలోని సబర్బన్ రైళ్ల సర్వీసులు రద్దయ్యాయని - ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ తోపాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు. వర్షాలధాటికి నగరంతోపాటు దానికి ఆనుకొని ఉన్న ఠాణె - పాల్గాఢ్ జిల్లాల్లోని చాలా రహదారులు - నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో జనం నడుంలోతు వరకు నీటిలోనే ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రధానంగా నీటిని అందిస్తున్న తుల్సి సరస్సు భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతోంది. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ లంచ్ బాక్సులను చేరవేసే ముంబై డబ్బావాలాలు మంగళవారం తమ సేవలను నిలిపేశారు. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో సేవలను నిలిపేస్తున్నామని ముంబై దబ్బావాలా సంఘం అధికార ప్రతినిధి సుభాశ్ తలేకర్ తెలిపారు.