ఢిల్లీ లాబీయింగ్‌.. బాబుకు క‌లిసి వ‌స్తుందా..?

Update: 2022-08-18 00:30 GMT
రాజ‌కీయాల్లో వ్యూహాలు.. ప్ర‌తి వ్యూహాలు కామ‌నే. ఎప్పుడు ఎవ‌రు.. ఎలాంటి వ్యూహం వేస్తే.. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం.. కూడా దానికి అనుగుణంగా.. ప్ర‌తి వ్యూహం వేయ‌డం కామ‌న్‌. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ ఇదే వ్యూహాన్ని అమ‌లు చేసింది. ఎన్నిక‌ల‌కు ముందు కేంద్రంతో లాబీయింగ్ చేసిందో.. లేక మ‌రేం చేసిందో తెలియ‌దు కానీ.. చంద్ర‌బాబు స‌ర్కారుకు మాత్రం అష్ట‌దిగ్భంధ‌నం అయ్యేలా వ్య‌వ‌హ‌రిం చింద‌నే టాక్ ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న కీల‌క‌మైన అధికారుల‌ను త‌ప్పించేసింది.

స‌రిగ్గా ఎన్నిల‌కు 15 రోజ‌లు ముందు.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని త‌ప్పించేసి.. అప్ప‌టి కార్య‌ద‌ర్శిగా ఉన్న ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని ఆ పోస్టులోకి టెంప‌ర‌రీగా వ‌చ్చేలా చేసింది. ఇక‌, అప్ప‌టి వ‌ర‌కు వైసీపీ పైనా..  ఆ పార్టీ నేత‌ల‌పైనా క‌స్సుబుస్సులాడిన డీజీపీ.. ఠాకూర్‌ను సైలెంట్ చేసేసింది. మ‌రోవైపు.. ఆర్థికంగా.. టీడీపీ నేత‌లు.. క‌ద‌లి వీలు లేకుండా కూడా.. చేశార‌నే టాక్ వినిపించింది. అంటే.. మొత్తంగా దీని వెనుక ఢిల్లీలో చేసిన లాబీయింగ్ కావొచ్చు.. రాజకీయ వ్యూహం కావొచ్చు.. అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ టీడీపీని ఇరుకున ప‌డేసింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి వైసీపీకి కూడా ఎదురవుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రో ఏడాది న్న‌ర‌లో.. ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్న‌..ఏపీలో కూడా.. అచ్చం అలేనే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న లాబీయింగ్ ఫ‌లితంగా ఏపీలో కీల‌క‌మైన పోస్టుల్లో ఉన్నతాధికారులుగా తనకు అనుకూల‌మైన, తన సామాజికవర్గానికి చెందిన నేతలే అపాయింట్ కావడం  హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వాల‌ను సైతం గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదనపు డైరెక్టర్ గా దినేష్ పరుచూరి నియమితులయ్యారు.

ఈయ‌న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. ఈయన అప్పాయింట్‌మెంట్ అనూహ్యంగా జ‌రిగింది. దీని వెను క బ‌ల‌మైన కార‌ణం ఉండి ఉంటుంద‌ని.. భావిస్తున్నారు. దినేష్ పరుచూరి చంద్రబాబు ముఖ్యమం త్రిగా ఉన్న సమయంలో ఏపీలో ట్రాన్స్‌కో జేఎండీగా పనిచేశారు.

కస్టమ్స్ సిజీఎస్టీ విభాగం అధిపతిగా శివనాగకుమారి ఉన్నారు. ఇది కూడా కీలక పదవే. కస్టమ్స్ అదనపు డైరెక్టర్లుగా దొంతి గాంధీ, వెంకయ్య చౌదరిలు నియమితులయ్యారు. వీరు కూడా చంద్ర‌బాబుకు అనుకూల‌మైన అధికారులేన‌నే టాక్ ఉంది.

ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో లాబీయింగ్ కార‌ణంగానే ఈ పోస్టుల నియామ‌కం జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో.. వైసీపీ నాయ‌కుడు.. విజ‌య‌సాయిరెడ్డి ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. ఇలానే ఇప్పుడు.. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన సుజ‌నా చౌద‌రి కూడా ఇలానే చ‌క్రం తిప్పుతున్నారా?  టీడీపీ ప‌క్షాన ఆయ‌న కేంద్రంలో పావులు క‌దుపుతున్నారా? అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. మ‌ళ్లీ కేంద్రంలో చంద్ర‌బాబు హ‌వా పెరుగుతోంద‌ని చెప్ప‌డానికి ఈ నియామ‌కాలే ఉదాహ‌ర‌ణ అని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News