చిన్నారులపై డెల్టా విజృంభణ ... భయం గుప్పిట్లో అమెరికా

Update: 2021-09-04 09:30 GMT
అగ్రరాజ్యం అమెరికా లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో అంటే ఒక్కరోజే దాదాపు లక్షన్నర కేసులు నమోదు కావడం భయాందోళనలు సృష్టిస్తోంది. కరోనాను కట్టడి చేసేశాం, ఇక మాస్కులే అవసరం లేదు. మునుపటి వలే స్వేచ్ఛగా ఉందాం, అంటూ మాట్లాడిన అధ్యక్షుడు జోబైడెన్  తాజా పరిస్థితితో ఎదురవుతున్న సవాల్ ను ఎదుర్కొనేందుకు కిందా మిందా అవుతున్నారు.

ఈ ఏడాదిలో గత  ఫిబ్రవరి నెల తర్వాత  మళ్లీ అంత భారీ స్థాయిలో కేసులు నమోదు అవుతుండడంతోపాటు మరణాలు పెరుగుతుండడం  కలకలం రేపుతోంది.  ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధిక కేసులు ఒక్క అమెరికా నుండే వస్తున్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో అగ్రరాజ్యం చిగురుటాకులా వణికిపోతోంది.  అమెరికాలో నమోదవుతున్న అత్యధిక కేసుల్లో ఎక్కువ భాగం కేసులు ఫ్లోరిడా, టెక్సాస్‌ రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి. మూడో వంతు కేసులు ఈ రాష్ట్రాల్లోనివే ఉంటున్నాయి. అమెరికా ఆరోగ్య సంస్థ తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో అమెరికాలో 1లక్షా 49వేల 788 కేసులు, 668 మరణాలు  నమోదు అయ్యాయి. దీంతో మొత్తం  కరోనా కేసుల సంఖ్య 3.53 కోట్లకు, మొత్తం మృతుల సంఖ్య 6.14లక్షలకు చేరుకుంది.

అమెరికాలో తాజాగా కరోనా కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండడమే కారణమని వైద్య నిపుణుల విశ్లేషణ. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశించినా పరిస్థితి మారడం లేదు. అంతేకాదు వ్యాక్సిన్ వేయించుకుంటే 100 డాలర్లు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించారు. దీంతో గడిచిన 10 రోజుల వ్యవధిలోనే 30లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు.

అలాగే 18 ఏళ్లు పైబడిన 70శాతం మందికి కనీసం ఒక్కడోసును అందించగలిగామని అధికారులు ప్రకటించినా కేసులు పైపైకి పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వ్యాక్సిన్  పై అనుమానాలు, అపోహలతో ఉన్న సుమారు 9 కోట్ల మందికి ఎలా వ్యాక్సిన్ వేయించాలన్న దానిపై దృష్టి సారించారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో పలు రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.  మాస్కులు ధరించడం..భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి)  కొత్త అధ్యయనం ప్రకారం, యుఎస్‌ లో 0-17 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో కరోనా వైరస్ కేసులు,  హాస్పిటల్ అడ్మిషన్లు గత కొన్ని రోజులుగా పెరుగుతూపోతున్నాయి.
Tags:    

Similar News