ట్రంప్ అభిశంస‌న ఎపిసోడ్ షురూ

Update: 2017-07-14 05:10 GMT
అనుకున్న‌దే జ‌రిగింది. అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద అభిశంస‌న తో ప‌ద‌వి నుంచి తొల‌గించే ప్ర‌య‌త్నంలో తొలి అంకం మొద‌లైంది. అయితే.. ఈ ప్ర‌య‌త్నం ట్రంప్ పై పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌న‌ప్ప‌టికీ.. ఆయ‌న్ను ఇబ్బంది పెడుతుంద‌ని మాత్రం చెప్ప‌క త‌ప్ప‌దు. ట్రంప్‌ ను త‌ప్పు ప‌ట్టే వారికి తాజా ప‌రిణామం ఒక ఆయుధంగా మారుతుంది.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన నాటి నుంచి త‌న‌దైన శైలిలో చెల‌రేగిపోయిన ట్రంప్‌.. అమెరికా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత కూడా త‌న తీరును ఆయ‌న మార్చుకోలేదు. ఇది ఆయ‌న‌పై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసేందుకు కార‌ణంగా మారుతోంది. అమెరికా అధ్య‌క్షుడిగా ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై విప‌క్ష డెమోక్రాటిక్ పార్టీ నేత‌లు అభిశంస‌న తీర్మానాన్ని పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆయ‌న‌పై కాలిఫోర్నియా డెమోక్రాటిక్ స‌భ్యుడు బ్రాడ్ షెర్మాన్ ప్ర‌తినిధుల స‌భ‌లో అభిశంస‌న తీర్మారాన్ని పెట్టారు.

దీనిపై ఆయ‌న స‌హ‌చ‌ర స‌భ్యుడు అల్ గ్రీన్ సంత‌కం చేశారు. ఇక‌.. అభిశంస‌న ఆరోప‌ణ‌ల్లో ట్రంప్ పై గ‌తం లో వినిపించిన ఆరోప‌ణ‌ల్ని మ‌రోసారి ఉటంకించారు. ర‌ష్యా నుంచి సాయం తీసుకోవ‌టానికి ట్రంప్ ప్ర‌చార బృందం ఆస‌క్తి చూపించింద‌ని ట్రంప్ త‌న‌యుడు డోనాల్డ్ ట్రంప్ జూనియ‌ర్ ఇటీవ‌ల వెల్ల‌డించిన వైనాన్ని షెర్మాన్ గుర్తు చేశారు.

ట్రంప్ త‌న మాజీ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు మైకేల్ ఫ్లిన్ పై ద‌ర్యాఫ్తును.. ర‌ష్యా ప్ర‌మేయంపై విచార‌ణ‌ను ఆపేయాల‌ని అధ్య‌క్షుల వారు ప్ర‌య‌త్నించ‌టం చూస్తే  ట్రంప్ ఏదో దాచుస్తున్న‌ట్లుగా క‌నిపిస్తుంద‌న్న సందేహాల్ని వ్య‌క్తం చేశారు. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్ట‌ర్ జేమ్స్ కోమీతో సంభాష‌ణ‌.. ఆ త‌ర్వాత కోమీ తొల‌గింపు లాంటి ప‌రిణామాలు న్యాయ ప్ర‌క్రియ‌ను అడ్డుకోవ‌టంగా తాను భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త లేని లేని అధ్య‌క్షుడి చ‌ర్య‌లు చూసి రోజూ డెమోక్రాట్లు.. రిప‌బ్లిక‌న్లే కాదు ప్ర‌పంచం మొత్తం షాక‌వుతోంద‌ని.. ఆయ‌న ఏదీ నేర్చుకోవ‌టానికి సిద్ధం లేర‌న్నారు. మాట మీద ట్రంప్‌న‌కు నియంత్ర‌ణ లేద‌ని.. త‌న‌ను నియంత్రించే సిబ్బందిని కూడా ఆయ‌న నియ‌మించుకోలేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

మ‌రి.. ట్రంప్ మీద అభిశంస‌న ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుంద‌న్న విష‌యంలోకి వెళితే.. ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌ద‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. అధికార ప‌క్షానికి పూర్తి మెజార్టీ ఉన్న స‌భ‌లో అభిశంస‌న తీర్మానాన్ని ఆమోదించ‌టం అసాధ్యం. దీంతో.. అభిశంస‌న తీర్మానం కాస్తంత హ‌డావుడి చేయ‌టానికి త‌ప్పించి మ‌రి దేనికీ ప‌నికి రాద‌ని చెబుతున్నారు. 435 మంది స‌భ్యులున్న స‌భ‌లో అధికార రిప‌బ్లిక‌న్ల‌కు 240 మంది స‌భ్యుల‌తో మెజార్టీ ఉంది. విప‌క్ష మెమోక్రాట్ల‌కు కేవ‌లం 194 మంది స‌భ్యులే ఉన్నారు. ఒక సీటు ఖాళీగా ఉంది. ప్ర‌తిపక్షం కంటే అధికార ప‌క్షానికి 46 సీట్లు అధికంగా ఉన్న నేప‌థ్యంలో తీర్మానం త‌దుప‌రి ద‌శ‌కు వెళ్లే ఛాన్స్ లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంటే.. ట్రంప్ పై తొలి అభిశంస‌న తీర్మానం మీడియాలో న‌ల‌గ‌టానికి.. రాజ‌కీయంగా ఆయ‌న‌పై ఒత్తిడి పెంచ‌టానికి మాత్ర‌మే వీల‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News