శృంగారం-విడాకులపై కోర్టు సంచలన వ్యాఖ్యలు!

Update: 2016-10-13 06:44 GMT
ఢిల్లీ హైకోర్టు మ‌రో సంచ‌లన తీర్పు ఇచ్చింది! వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం శృంగారానికి నో చెబితే... అలాంటి భార్య‌కు భ‌ర్త‌తో విడాకులు మంజూరు చెయ్యొచ్చ‌ని చెప్పింది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి కూడా శృంగారానికి ఎక్కువ కాలం నిరాకరించ‌డం అనేది మాన‌సిక క్రూర‌త్వంగానే పరిగ‌ణించాల్సి ఉంటుంద‌ని ఒక కేసు విష‌య‌మై తీర్పు చెబుతూ కోర్టు వ్యాఖ్యానించింది. నాలుగున్న‌రేళ్లుగా భార్య త‌న ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేందుకు నిరాక‌రిస్తోంద‌నీ - శారీర‌కంగా ఆమెకు ఎలాంటి స‌మ‌స్య‌లు లేక‌పోయినా కూడా ఉద్దేశ‌పూర్వ‌కంగానే త‌న‌పై క‌క్ష‌సాధింపు ధోర‌ణి అవ‌లంభిస్తోందంటూ ఒక భ‌ర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించాడు. ఆమెతో త‌న‌కు విడాకులు మంజూరు చేయాల‌ని పిటీష‌న‌ర్ కోరాడు. దీంతో వాదోప‌వాదాలు విన్న త‌రువాత అత‌డికి విడాకులు మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. నిజానికి - ఇదే కేసును దిగువ కోర్టు ఇంత‌కుముందు కొట్టేసి తీర్పు ఇచ్చింది!

2001 నవంబ‌ర్ 26న హ‌ర్యానాలో వీరిద్ద‌రికీ పెళ్ల‌యింది. ప్ర‌స్తుతం వారికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. ఒక‌రిక‌రి 10 ఏళ్లు, మ‌రొక‌రికి 9 సంవ‌త్స‌రాలు. కొంత‌కాలంగా త‌న భార్య ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింద‌ని పిటీష‌నర్‌ వాపోతున్నాడు. ఇంట్లో ప‌నులు చిన్న ప‌నులు కూడా చేయ‌డం మానేసింద‌ని అంటున్నాడు. రానురానూ త‌న ప్ర‌వ‌ర్త‌న క్రూరంగా మార‌డంతో త‌న‌తోపాటు పిల్ల‌లు కూడా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పాడు. దాంతో కొన్నాళ్లుగా అదే ఇంట్లో వేరే పోర్ష‌న్ లో విడిగా ఉండ‌మంటూ చాలామంది స‌ల‌హాలు ఇచ్చార‌న్నాడు. గ‌డ‌చిన నాలుగున్న‌రేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నా సంసార సుఖం లేకుండా పోవ‌డంతో విడాకులు కోరుతూ దిగువ కోర్టును ఆశ్ర‌యించాడు స‌ద‌రు భ‌ర్త‌. అయితే, ఈ విడాకులు పిటిష‌న్ కొట్టేస్తూ దిగువ కోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని స‌వాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించాడు.

విడాకులు మంజూరు చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. ఈ కేసులో భార్య వ‌ల్ల భ‌ర్త మాన‌సికంగా చాలా కృంగిపోయాడ‌ని నిరూప‌ణ అయింద‌నీ - ఒకే ఇంట్లో ఉంటూ కూడా సంసార సుఖం లేకుండా పోయింద‌నీ, ఆమెకి ఎలాంటి మాన‌సిక - శారీర‌క స‌మ‌స్య‌లు లేక‌పోయినా కూడా భ‌ర్త‌లో సంసారం చేసేందుకు నిరాక‌రిస్తోంద‌నీ, కాబ‌ట్టి ఈ కేసులో విడాకులు మంజూరు చేయ‌డ‌మే స‌రైంద‌ని అవుతుంద‌ని జ‌స్టిస్ ప్ర‌దీప్ నందారాగోజ్‌ - ప్ర‌తిభారాణిల‌తో కూడ‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News