సొంత పార్టీ నాయ‌కుల‌పైనే డిప్యూటీ సీఎం హాట్ కామెంట్స్!

Update: 2022-09-10 06:33 GMT
క‌ళ‌త్తూరు నారాయ‌ణ‌స్వామి ప్ర‌స్తుతం వైఎస్ జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్ జ‌గ‌న్ మొద‌టి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనూ, రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనూ డిప్యూటీ సీఎంగా చాన్స్ కొట్టేశారు. కీల‌క‌మైన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. మొద‌టి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అయితే ఎక్సైజ్ శాఖ‌తోపాటు వాణిజ్య ప‌న్నుల శాఖ‌ను కూడా ఆయ‌నే ప‌ర్య‌వేక్షించారు.

వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత వీర విధేయుడైన డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీలోనే త‌నపై కుట్ర జ‌రుగుతోంద‌ని బాంబు పేల్చారు. సీఎం జ‌గ‌న్‌కు త‌న‌పై తీవ్రంగా కోపం వ‌చ్చే ప‌రిస్థితి కూడా ఉంద‌న్నారు. త‌న త‌ప్పు ఉంద‌ని కానీ.. అవినీతి చేశాన‌ని కానీ నిరూపిస్తే వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాన‌న్నారు. పార్టీ శ్రేణుల‌ను, అమాయ‌క ప్ర‌జ‌లను రెచ్చ‌గొడితే పార్టీ నుంచి బ‌హిష్క‌రించే రోజులు వ‌స్తాయిని హెచ్చ‌రించారు.

వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లు పార్టీని వదిలి వెళ్లిపోవాల‌ని నారాయ‌ణ‌స్వామి డిమాండ్ చేశారు. కుట్రంతా త‌న‌ గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని ఒక మండలంలోనే జరుగుతోందని నారాయ‌ణ స్వామి హాట్ కామెంట్స్ చేశారు. త‌న‌ను అవ‌మానించిన‌ విషయం చెబితే అది ఎంతవరకు పోతుందో..

ఏమవుతుందో ఆ మనిషికి తెలియడం లేద‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ప్రభుత్వంలో ముఖ్య హోదాలో ఉన్న ఒక నాయకుడికి, త‌న‌ నియోజకవర్గంలో ఒకే ఒక మండలంలోని ఒక నాయకుడికి రూ.13 కోట్ల నుంచి రూ.14 కోట్ల రోడ్డు పనులు కూడా ఇచ్చానని బాంబుపేల్చారు.

త‌న నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు సెప్టెంబ‌ర్ 11న‌ పెనుమూరు మండలం రావాలంటూ త‌న‌కు వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజులు వైర‌ల్ చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అందువ‌ల్లే తాను స్పందించాల్సి వ‌స్తోంద‌ని చెప్పారు.

కాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో డిప్యూటీ సీఎం క‌ళ‌త్తూరు నారాయ‌ణ‌స్వామి త‌న‌ కుమార్తె కృపాల‌క్ష్మిని త‌న‌కు బ‌దులుగా పోటీలో దించాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు 73 ఏళ్లు వ‌య‌సు. దీంతో వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెను గంగాధ‌ర నెల్లూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దించుతారని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పటి వరకు రాజకీయంగా అంతగా బయటకు రాని ఆయ‌న కుమార్తె కృపాల‌క్ష్మి ఇటీవల రాజకీయంగా క్రియాశీల‌కంగా ఉంటున్నారు. తరచూ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. వైఎస్సార్సీపీ కీలక నేతలను కలుస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News