రివర్స్ ఎటాక్ మొదలుపెట్టిన రేవతి

Update: 2020-12-10 15:16 GMT
కాజా టోలుప్లాజా దగ్గర ఉదయం అయిన గొడవతో బాగా అల్లరిపాలైన వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ళ రేవతి సాయంత్రానికి రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. ఉదయం గుంటూరు నుండి విజయవాడకు బయలుదేరిన రేవతి మధ్యలో కాజా టోలుగేటు దగ్గర ఫీజు చెల్లించకుండానే వెళ్ళేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఫీజు కోసం ఆమెను అడ్డుకున్న టోలు సిబ్బందిపైన కూడా ఆమె దౌర్జన్యం చేసిన వీడియోలు కలకలం రేపాయి.

రేవతి వాహనం బయలుదేరనీయకుండా సిబ్బంది పెట్టిన బ్యారికేడ్లను ఆమె తొలగించటం, వాళ్ళని కొట్టడం స్పష్టంగా వీడియో ఫుటేజీల్లో కనబడుతోంది. ఉదయం నుండి ఈ వీడియో క్లిప్పింగు బాగా వైరల్ అయ్యింది. దీంతో వైసీపీ నేతల నుండే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఛైర్ పర్సన్ పై అందరు మండిపోతున్నారు. ఇటువంటి వాళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి ఇమేజికి డ్యామేజి జరుగుతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగులు మొదలయ్యాయి.

ఇదంతా గమనించినట్లే ఉన్నారు. అందుకనే సాయంత్రానికి రేవతి ఎదురుదాడి మొదలుపెట్టారు. తనపైనే టోలు ప్లాజా సిబ్బంది దౌర్జన్యం చేసినట్లు ఎదురు ఆరోపణలు మొదలుపెట్టారు. తన తల్లికి అనారోగ్యం కారణంగా అర్జంటుగా విజయవాడలోని ఆసుపత్రికి తీసుకెళ్ళాలని తాను ఎంతగా బతిమలాడినా వాళ్ళు వినలేదన్నారు. సంవత్సరాల తరబడి ఇదే రూటులో తిరుగుతున్న తన వాహనానికి పాస్ తో పాటా ఫాస్ట్ ట్యాగ్ ఉందన్నారు. ఫ్రీ పాస్ ఉన్నపుడు మళ్ళీ ఫాస్ట్ ట్యాగ్ అవసరం ఏమిటో ఆమెకే తెలియాలి.

తాను అర్జంటుగా హాస్పిటల్ కు వెళ్ళాలి కాబట్టి పక్కనుండి వెళిపోతానంటే టోలుప్లాజా వాళ్ళు ఒప్పుకోలేదట. పైగా తననే ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటున్నారు. తన వాదనకు మద్దతుగా తన దగ్గర వీడియోలు కూడా ఉన్నట్లు చెప్పుకున్నారు. అంతేకానీ ఆ వీడియోను మాత్రం చూపలేదు. కేవలం కొన్ని సెకన్ల వీడియోను రిలీజ్ చేయటం ద్వారా తనపై టీడీపీ వాళ్ళు బురద చల్లేస్తున్నట్లు ఆరోపించటమే విచిత్రంగా ఉంది. తనపట్ల టోలుప్లాజా వాళ్ళ ప్రవర్తన యావత్ మహిళాలోకానికే అవమానం అంటున్నారు. మధ్యలో టీడీపీ వాళ్ళకు ఏమి సంబంధమో మాత్రం చెప్పలేదు.
Tags:    

Similar News