చంద్ర‌బాబు వాట్సాప్ పాలన ఐడియా బాగుంది.. కానీ.. !

ఏపీలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. తొలిసారి డిజిట‌ల్ పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది.

Update: 2024-12-12 22:30 GMT

ఏపీలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. తొలిసారి డిజిట‌ల్ పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. వ‌చ్చేఏడాది జ‌న‌వ‌రి నుంచి రాష్ట్రంలో వాట్సాప్ పాల‌న ప్రారంభించ నున్న‌ట్టు ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. ఏకంగా 100 నుంచి 150 సేవ‌ల వ‌ర‌కు కూడా వాట్సాప్ ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తామ‌న్నారు. వాట్సాప్ మాధ్య‌మం ద్వారా ప్ర‌జ‌ల‌కు పాల‌న చేరువ చేస్తున్న‌ట్టు ముఖ్య‌మంత్రి తెలిపారు.

బుధ‌వారం జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడుతూ.. వాట్సాప్ ద్వారా 100కు పైగా పౌర సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. త‌ద్వారా.. ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సిన ప‌నిలేకుండా ఇంటి నుంచే సేవ‌లు పొందే అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌న్నారు. జ‌న‌న‌, మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌తోపాటు.. ఫ్యామిలీ స‌ర్టిఫికెట్ ను కూడా పొందేందుకు వీలుగా దీనిని అందుబాటులోకి తీసుకువ‌స్తున్న‌ట్టు చెప్పారు.

అదేవిధంగా మునిసిప‌ల్ ప‌న్నులు, క‌రెంటు బిల్లులు వంటివాటిని కూడా చెల్లించుకునేందుకు వాట్సాప్ ద్వారా అవ‌కాశం ఉంటుంద‌నితెలిపారు. అయితే.. ఈ సేవ‌ల‌ను క‌లెక్ట‌ర్లు నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని.. ఇబ్బందులు త‌లెత్తితే స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను అమ‌లు చేస్తున్న తొలి రాష్ట్రం మ‌నదేన‌ని తెలిపారు. ఇది విజ‌య‌వంతం అయ్యేలా క‌లెక్ట‌ర్లు చొర‌వ తీసుకోవాల‌ని కోరారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి వాట్సాప్ గ‌వ‌ర్న‌న్సును అందుబాటులోకి తీసుకువ‌స్తున్న‌ట్టు ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు.

క‌ట్ చేస్తే..

సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న బాగుంది. ఆయ‌న వ్యూహం కూడా బాగుంది. కానీ, అస‌లు చిక్కు రాష్ట్రంలో వాట్సాప్ వినియోగిస్తున్న‌వారు ఎందరు? అనేది కీల‌క ప్ర‌శ్న‌. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికీ ఫోన్లు లేవ‌ని వారు 70 శాతం మంది ఉన్నారు. ఉన్నా.. బ‌ట‌న్ ఫోన్లు వినియోగిస్తున్న వారే ఎక్కువ‌గా ఉన్నారు. న‌గ‌రాల్లోనూ.. 39 శాతం మంది బ‌ట‌న్ ఫోన్లే వినియోగిస్తున్న‌ట్టు తాజాగా ఎయిర్‌టెల్‌సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో స్ప‌ష్టమైంది. సో.. చంద్ర‌బాబు వ్యూహం బాగానే ఉన్నా.. స్మార్ట్ ఫోన్ల‌ను వినియోగించే వారిని మాత్రమే ఆయ‌న దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా ఉంది.

కానీ,ఈ విధానంతో అస‌లు పౌర సేవ‌లు నిలిచిపోతే.. ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇప్ప‌టికే ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ వ‌చ్చాక‌.. క‌ట్టిన సొమ్ముకు.. ర‌శీదులు ఇవ్వ‌డం లేదు. అదేస‌మ‌యంలో ఫ్రాడ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకుని.. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ విష‌యంలో లోతుగా అధ్య‌య‌నం చేయాల్సి ఉంటుందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News