జమిలి ఎన్నికల మీద భిన్న స్వరాలు!
ఒకే నేషన్ ఒకే రేషన్ అన్న నినాదం ఇచ్చిన పార్టీ అదే.
మొత్తానికి దేశంలో జమిలి ఎన్నికలకు తెర లేస్తోంది. అలా తెరలేపుతోంది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే. ఆ పార్టీకి ఒకటి అంటే చాలా ఇష్టం. ఒకే నేషన్ ఒకే రేషన్ అన్న నినాదం ఇచ్చిన పార్టీ అదే.
అలాగే యూనిఫాం సివిల్ కోడ్ అన్నది బీజేపీ అజెండాలో భాగమే. ఇపుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అంటోంది. దానినే వ్యావహారికంలో జమిలి ఎన్నికలు అని అంటారు.
జమిలి ఎన్నికలు పెడితే దేశంలో ఒకేసారి అంతా ఓటేస్తారు. అని మళ్లీ అయిదేళ్ల వరకూ ఎన్నికల ప్రసక్తి ఉండదని అంటున్నారు దీని వల్ల టైం ఖర్చు ఆదా అవుతుందని ఎన్నికల కోడ్ పేరుతో అవరోధాలు కూడా ఉండవని అంటున్నారు. అంతే కాదు కేంద్రంలో అధికారం కోసం లోక్ సభకు అలాగే రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒకేసారి ఎన్నికలు జరిపించడం ఆ మీదట వంద రోజుల వ్యవధిలో స్థానిక ఎన్నికలను కూడా జరిపించడం అన్నది బీజేపీ విధానంగా ఉంది.
ఈ జమిలి ఎన్నికల ఆలోచన తరువాత మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీని నియమించి అధ్యయనం చేయించారు ఆ కమిటీ నివేదిక ఈ సెప్టెంబర్ లో ఇచ్చింది. దానిని తాజాగా బిల్లుగా మార్చి కేంద్రం ఆమోదించింది. ఇపుడు దానిని లోక్ సభలో ప్రవేశపెట్టి ఆ మీదట రాజ్యసభలో కూడా నెగ్గించాలని చూస్తున్నారు. ఈ బిల్లు చట్టం అయితే రెండేళ్ళ వ్యవధిలో దేశంలో ఎన్నికలు వస్తాయని అంటున్నారు.
అయితే ఇదంతా బాగానే ఉన్నా జమిలి ఎన్నికల మీద దేశంలో మేధావులు విద్యావంతులు రాజకీయ విశ్లేషకులు నుంచి సగటు ప్రజల దాకా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంచిదే అని కొందరు అంటే దీని వల్ల ఒనగూడేది ఏమిటి అన్నది మరి కొందరి వాదనగా ఉంది. జమిలి ఎన్నికలకు లాజిస్టిక్ సమస్య అతి పెద్ద అడ్డంకిగా మారుతుందని మేధావులు అంటున్నారు. ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్స్ ని అందుబాటులో ఉంచడం కూడా పెద్ద సమస్యగా మారుతుందని అంటున్నారు.
అదే సమయంలో ఎన్నికల నిర్వహణ మీద పారదర్శకత మీద కూడా అనేక అనుమానాలు వస్తాయని అంటున్నారు. జాతీయ పార్టీలదే హవాగా ఉంటుందని జాతీయ అజెండాయే ముందుకు వస్తుందని కూడా అంటున్నారు. అదే సమయంలో ఎన్నికల సిబ్బంది ఖర్చు తగ్గుతుందని అది లాభమని అంటున్నారు. అలాగే ఒకేసారి ఎన్నికలు అంటే ఎన్నికల కోడ్ అన్నది ఒకేసారి పెట్టి తీసేస్తారు కాబట్టి అభివృద్ధికి అది ఇబ్బందిగా మారదని అది కూడా మేలు చేసే అంశమే అని అంటున్నారు.
అయితే ఒకెసారి ఎన్నికలు అంటే అది సాధ్యమేనా అన్నది కూడా చర్చగా ఉంది. అంతే కాదు ఒకచోట ప్రభుత్వం మధ్యలో పడిపోతే దానికి పరిష్కారాలు ఏ విధంగా చూపిస్తారు, మెజారిటీలు రానపుడు ఏమి చేస్తారు. మధ్యలో ఎవరైనా మరణిస్తే ఉప ఎన్నికలు ఉంటాయా రాజీనామాలు చేసిన చోట కూడా ఉప ఎన్నికలు పెట్టాల్సి ఉంటుంది కదా అపుడు ఏమి చేస్తారు అన్న చర్చ అయితే ఉంది. చూడాలి మరి.