మహా కుటమిలో దేవరకొండ కుంపటి

Update: 2018-09-30 11:50 GMT
ఎన్నికల వేళ పార్టీల్లో సీట్ల లొల్లి షరా మాములే. అసలు మహా కుటమి సీట్ల సర్దుబాటు కథ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ సీట్ల పొత్తు కుదరకముందే  ఓ నియోజకవర్గంలో కుంపటి రాజేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. అదే నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం.. దశాబ్దాలుగా కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన దరిమిలా టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక్కడ కూడా తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కు టిక్కెట్ కేటాయించేసింది. రవీంద్రకుమార్ గడిచిన 2014 ఎన్నికల్లో సీపీఐ తరఫున ఇక్కడ పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత కారెక్కాడు. దీంతో సిట్టింగ్ అయిన ఈయనకే టీఆర్ ఎస్ టికెట్ ఇచ్చింది.  అప్పటి వరకు టిక్కెట్ ఆశించిన నియోజకవర్గ టీఆర్ ఎస్ నేత బాలూనాయక్ కు ఈ పరిణామం మింగుడు పడలేదు. ఆయన టీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ - జానారెడ్డిలు బాలు నాయక్ కు దేవరకొండ ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చారట. అయితే దేవరకొండ నియోజకవర్గం సీపీఐ సిట్టింగ్ స్థానం కావడంతో మహాకూటమి చర్చల్లో ఈ సీటు తమకు కంపల్సరీగా కావాలని సీపీఐ కాంగ్రెస్ కు షరతు విధించింది. తమకు ఈ సీటు కేటాయించాల్సిందేనని సీపీఐ భీష్మించుకొని కూర్చుంది.

తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సీపీఐ నుంచి గెలుపొందారు ఆ తరువాత అభివృద్ధి కోసం అంటూ టీఆర్ ఎస్ లో చేరారు. అలాగే, బాలూ నాయక్ కు కూడా బలమైన వర్గం ఇక్కడ ఉంది. 2009లో కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత జడ్పీ చైర్మన గా బాధ్యతలు చేపట్టారు. ఈయన టీఆర్ ఎస్ లోనే కొనసాగుతున్నారు  ప్రస్తుతం ఆయన టీఆర్ ఎస్ నుంచి టిక్కెట్ ఆశించారు. రవీంద్ర కుమార్ కు కేటాయించడంతో  అలకబూని కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీనివల్ల టీఆర్ ఎస్ కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ సీటు కేటాయిస్తామని రాయబారం పంపినా బాలూ నాయక్ శాంతించడం లేదు.

కాగా, సీపీఐ కూడా దేవరకొండ నియోజకవర్గాన్ని తమకు అప్పగించాలని కోరుతోంది. కమ్మూనిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో తమకు అప్పగించాలని స్పష్టం చేస్తోంది. సీపీఐ కూడా  మహాకూటమిలో అంతర్భాగం కావడంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. హామీ ఇచ్చిన బాలు నాయక్ కు టికెట్ ఇవ్వలేక.. ఇటు సీపీఐ ప్రతిపాదనను కాదనలేక కాంగ్రెస్ మల్ల గుల్లాలు పడుతోంది. మొత్తానికి ఎన్నికల వేళ అలకలు సహజమే కానీ, అటు టీఆర్ ఎస్ - ఇటు మహా కూటమిలకు అసంతృప్తులు తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు.  ఎన్నికలు ముగిసేలోపు ఇంకా ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయో  వేచిచూడాల్సిందే..
    

Tags:    

Similar News