దేవేగౌడ కు కాంగ్రెస్ ఏం చెప్పిందో!

Update: 2019-04-20 01:30 GMT
ఇటీవలే ఏపీలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఆసక్తిని రేపారు జేడీఎస్ సుప్రీమో దేవేగౌడ. ఏపీలో చంద్రబాబు అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఈ గౌడ్రు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఆయన  మాట్లాడుతూ.. చంద్రబాబును ప్రశంసించి.. ఆయనను ఏకంగా ప్రధానమంత్రి అభ్యర్థిని చేశారు.

ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎంపీగా ఏమీ పోటీ చేయలేదు. అయినా దేవేగౌడ అలా ఊరించారు. ఆ సంగతలా ఉంటే..కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్భంగా దేవేగౌడ మాట్లాడుతూ..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని ప్రకటించేశారు! తమ మద్దతు ఆయనకే అని తెలిపారు.

నిన్నామొన్న కూడా దేవేగౌడ కాస్త భిన్నమైన వ్యాఖ్యలు చేశారు కూడా. అటు ఎన్డీయే కానీ, ఇటు యూపీఏ కానీ కేంద్రంలో తగినంత బలాన్ని పొందే అవకాశం లేదని దేవేగౌడ అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ - మాయవతి లకు మంచి అవకాశాలు ఉంటాయన్నట్టుగా  ఆయన మాట్లాడారు.  మరి ఇంతలోనే ఏమైందో ఏమో కానీ..దేవేగౌడ తన స్టేట్ మెంట్ ను మార్చేశారు.

రాహుల్ గాంధీకే తమ మద్దతు అని ప్రకటించారు. కర్ణాటకలో జేడీఎస్ కు ముఖ్యమంత్రి పీఠం దక్కడంలో కాంగ్రెస్ సహకారం ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ సంకీర్ణ సర్కారులో జేడీఎస్ కు బలం తక్కువ అయినా.. కాంగ్రెస్ వాళ్లు వారికే అవకాశం ఇచ్చారు. తమ పార్టీ నేత సీఎంగా లేకపోయినా ఫర్వాలేదు బీజేపీకి ఛాన్స్ దక్కకూడదన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరించింది.

అయితే దేవేగౌడ మాత్రం ఇటీవల.. ప్రధానమంత్రి అభ్యర్థిత్వం విషయంలో భిన్నమైన కామెంట్లు చేసి వార్తల్లోకి వచ్చారు. చంద్రబాబు - మమత - మాయ.. అని ఆయన అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ వాళ్లు ఆయనకు ఏం చెప్పారో ఏమో కానీ.. ఉన్నట్టుండి.. రాహుల్ గాంధీనే తమ ప్రధానమంత్రి అభ్యర్థి - ఆయకే జేడీఎస్ మద్దతు.. అని చెప్పుకొచ్చారు. మోడీని మాత్రం ప్రధానమంత్రి కానీయడానికి వీల్లేదని - తను ఈ సారి ఎంపీగా నెగ్గి లోక్ సభలో రాహుల్ కు అండగా నిలబడపోతున్నట్టుగా ఈయన ప్రకటించుకున్నారు!
Tags:    

Similar News