అభివృద్ధి Vs సంక్షేమ ప‌థ‌కాలు!

Update: 2022-11-07 18:29 GMT
ఔను.. ఇప్పుడు ఇదే విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. అభివృద్ధి.. సంక్షేమ ప‌థ‌కాలు ప‌నిచేస్తున్నాయా?  లేదా? అనేది ఇప్పుడు ఆస‌క్తి గా మారింది. ఎందుకంటే.. కీల‌క‌మైన మునుగోడు ఉప ఎన్నిక‌లో ఈ రెండు అంశాల‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది. దాదాపు ఎనిమిది సంవ‌త్స‌రాలుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేసింది. అదేవిధంగా అభివృద్ధిని సైతం చేప‌ట్టింది. అయితే.. ఈ రెండు కూడా.. తాజాగా జ‌రిగిన మునుగోడు ఉప ఎన్నిక‌లో ప్ర‌భుత్వానికి కానీ, టీఆర్ ఎస్ పార్టీకి కానీ మేలు చేసిన ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో ఇప్పుడు అభివృద్ది వ‌ర్సెస్ సంక్షేమ ప‌థ‌కాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి ఉమ్మ‌డి ఏపీని తీసుకుంటే.. గ‌తంలో అభివృద్ధి, సంక్షేమం అనే అజెండా బాగానే ప‌నిచేసిన దాఖ‌లాలు ఉన్నాయి. అనేక ప్ర‌భుత్వాల విష‌యంలో ఇది రుజువు కూడా అయింది. ఇటీవ‌ల కాలాన్ని తీసుకుంటే.. వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి రెండో సారి ముఖ్య‌మం త్రి కావ‌డానికి అభివృద్ది, సంక్షేమ మంత్రాలు బాగానే ప‌నిచేశాయి.

వాస్త‌వానికి తొలిసారి వైఎస్‌ను ముఖ్య‌మంత్రి చేయ‌డంలో ఆయ‌న పాద‌యాత్ర ప‌నిచేసింది. దీంతో సింపతీ ఓట్లు ప‌డ్డాయి. అయితే, రెండో సారి మాత్రం ఖ‌చ్చితంగా అభివృద్ధినీ సంక్షేమాన్ని చూసి.. వైఎస్‌కు ఉమ్మ‌డి రాష్ట్ర ప్ర‌జ‌లు ఓటేశార‌నే చెప్పాలి. అయితే.. ఇక్క‌డే కొంత మేర‌కు సీట్లు త‌గ్గాయి.

అయిన‌ప్ప‌టికీ.. అభివృద్ధి సంక్షేమానికి ప్ర‌జ‌లు మొగ్గు చూపారు. ఉదాహ‌ర‌ణ‌కు అభివృద్ది విష‌యాన్ని తీసుకుంటే.. పోల‌వ‌రం ప్రాజెక్టు, ప్ర‌త్యేక ఆర్థిక మండ‌ళ్ల(ఎస్ ఈ జెడ్‌) ద్వారా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేయ‌డం.. అదేవిధంగా రింగు రోడ్లు, ర‌హ‌దారుల‌కు ప్ర‌త్యేకంగా బ‌డ్జెట్ కేటాయించ‌డం, విస్తృతంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూ.. `జ‌ల‌య‌జ్ఞం` అనే కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయ‌డం.. ద్వారా.. అభివృద్ది మంత్రం వైఎస్ హ‌యాంలో జోరుగా ప‌నిచేసింది. ఇది రైతాంగాన్ని, గ్రామీణ ప్ర‌జ‌ల‌ను కూడా వైఎస్ వైపు మ‌ళ్లేలా చేసింద‌న‌డంలో సందేహం లేదు.

ఇక‌, సంక్షేమం విష‌యానికి వ‌స్తే.. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు పావ‌లా వ‌డ్డీ రుణాలు, ఆరోగ్య శ్రీ, పింఛ‌న్ల పెంపు, రైతు రుణ మాఫీ, ఎస్సీ రుణాలు, విద్యుత్ స‌బ్సిడీ, ఇందిర‌మ్మ ఇళ్లు వంటివి ఆకట్టుకున్నాయి. ఫ‌లితంగా ఇది వైఎస్‌ను ఆయా వ‌ర్గాల్లో దేవుడిని చేశాయి. త‌ర్వాత కాలంలో భారీ ఎత్తున ప్ర‌తిప‌క్షాలు అన్నీ కూడా కూట‌మిగా ఏర్ప‌డి.. వైఎస్‌ను ఓడించేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా.. కూడా ఫ‌లించ‌లేదు. ఆశించిన సీట్లు రాక‌పోయినా మెజారిటీ సీట్లు ద‌క్కించుకుని రెండోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.

కానీ, ఇప్పుడు వీటిని మించి అన్న‌ట్టుగా కేసీఆర్ స‌ర్కారు ప‌థ‌కాలు అమ‌లు చేసింది. మిష‌న్ భ‌గీర‌థ కావొచ్చు, క‌ళ్యాణ ల‌క్ష్మి కావొచ్చు, ఎస్సీల ప‌థ‌కాలు కావొచ్చు, గొర్రెల పంపిణీ ఇలా అనేక సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. మునుగోడు ఫ‌లితం మాత్రం డ‌బ్బు చుట్టూనే తిరిగింద‌న‌డంలో సందేహం లేదు. అంటే, రానురాను ప్ర‌జ‌లు.. అభివృద్ధి-సంక్షేమాల వైపు కంటే ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌కు చేతిలో ప‌డుతున్న డ‌బ్బుల‌నే ప్రామాణికంగా తీసుకునే ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిలోకి జారిపోతున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News