కంగనా కాదు దావూద్ ఇల్ల కూల్చండి చూద్దాం :ఫడ్నవిస్

Update: 2020-09-11 17:26 GMT
సుశాంత్ సింగ్ కేసు నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనాకు - మహారాష్ట్రలోని ఉద్ధవ్ సర్కార్ కు మధ్య వివాదం చినికిచినికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. కంగన అడగ్గానే కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీ కేటాయించడం...కంగనా తల్లి ఆశా రనౌత్ ను బీజేపీలో చేరాలని ఆహ్వానించడం వంటి పరిణామాలతో కంగనా వెను బీజేపీ ఉందన్న ఆరోపణలకు బలం చేకూరుతుంది. ఈ నేపథ్యంలోనే ఉద్ధవ్ సర్కార్ పై మహారాష్ట్ర మాజీ సీఎం - బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. ఉద్దవ్ ప్రభుత్వానికి కరోనా కంటే కంగనాతో వివాదమే ముఖ్యమైందని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో రోజుకు 25 నుంచి 30 వేల కేసులు నమోదవుతున్నాయని - వాటిపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని విమర్శించారు.

మహారాష్ట్రలో కరోనా కేసులు10 లక్షల మార్క్ కు చేరువయ్యాయి. వారం రోజులుగా 25 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా బారిన పడి 29వేల మంది చనిపోగా - దేశంలోని కరోనా మరణాల్లో 40 శాతం మహారాష్ట్రలోనివే. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదని - కరోనా కట్టడిని వదిలేసి కంగనాపై పోరాడుతోందని ఫడ్నవిస్ విమర్శించారు. కంగనా విషయంలో చూపుతోన్న శ్రద్ధలో కనీసం 50 శాతం కరోనాపై చూపినా....కరోనా మరణాలు తగ్గేవన్నారు. శివసేన చర్యలకు కంగనా స్పందిస్తోందని, నోటీసులు ఇవ్వకుండా ఆమె బిల్డింగ్ కూల్చి భయపెట్టడానికే శివసేన ప్రయత్నించిందని విమర్శించారు. కంగనా రాజకీయ నేత కాదని, ఆమె కామెంట్లపై అతిగా స్పందించి ఇంత పెద్ద వివాదం చేయడం శివసేనకు అవసరమా? అని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలపై బీఎంసీ చర్యలు తీసుకుందని, అలాగే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇంటిని, ఆస్తుల్ని కూడా కూల్చేయగలరా?'' అని ఫడ్నవిస్ సవాల్ విసిరారు. మరి, ఈ వ్యాఖ్యలపై శివసేన స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News