మ‌హా ట్విస్ట్‌: ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణానికి ముహూర్తం ఫిక్స్‌

Update: 2019-11-01 14:00 GMT
మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ?  ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఇప్ప‌టికే అధికార పంప‌కంపై శివ‌సేన - బీజేపీ మ‌ధ్య ఐదారు రోజులుగా చ‌ర్చ‌లు ఎటూ తెగ‌డం లేదు. శివ‌సేన ప‌ద‌వుల పంప‌కం విష‌యంలో 50 - 50 ఫార్ములా అమ‌లు చేయాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డం - అటు బీజేపీ ఈ విష‌యంలో ఎటూ తేల్చ‌లేక‌పోవంతో పాటు ఐదేళ్ల పాటు త‌మ పార్టీ వ్య‌క్తే ముఖ్య‌మంత్రిగా ఉంటాడ‌ని... కీల‌క ప‌ద‌వులు తామే ఉంచుకుని.. శివ‌సేన‌కు 13 ప‌ద‌వులు మిన‌హా ఇవ్వ‌మ‌ని చెప్ప‌డంతో ఇంకా ప్రభుత్వ ఏర్పాటు సందిగ్ధంలోనే ఉంది.

ఈ ప్రతిష్టంభన ఓవైపు కొనసాగుతుండగానే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈనెల 5న పదవీ స్వీకార ప్రమాణం చేస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ సొంతంగానే ప్ర‌భుత్వ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేసింద‌ని బీజేపీ వ‌ర్గాలు వెల్ల‌డించ‌డంతో ఏం జ‌రుగుతుందో ? ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.  కూటమి నుంచి శివసేన తప్పుకున్నా తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ... ఈ బాధ్య‌త‌ల‌ను సీనియ‌ర్‌ ఎమ్మెల్యేలు ప్రసాద్‌ లద్‌ - చంద్రకాంత్‌ పాటిల్‌ కు అప్ప‌గించింది.

మ‌రోవైపు శివ‌సేన ఫైర్‌ బ్రాండ్ సంజ‌య్ రౌత్ మాత్రం 50 - 50 ఫార్ములాను అమ‌లు చేయాల్సిందే అని.. సీఎం ప‌ద‌వి కూడా చెరి స‌గం పంచుకోవాల్సిందే అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. బీజేపీ ధీమా ఇలా ఉంటే అటు వైపు మ‌రో ట్విస్ట్ చోటు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. శివ‌సేన అన్ని దారులు త‌న వైపున‌కు ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతోంది. శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే గురువారం రాత్రి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తో ఫోన్‌ లో మాట్లాడినట్లు సమాచారం. బీజేపీ తగ్గకుంటే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనే ప్రతిపాదన శరద్ పవార్ ముందు ఉద్ధవ్ థాక్రే ఉంచినట్లు సమాచారం.

శివసేనకు కాంగ్రెస్ - ఎన్సీపీలు సహకరిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనే ప్రపోజల్ ఉద్ధవ్ థాక్రే ముందు ఉంచినట్లు సమాచారం. అటు ఎన్సీపీ - కాంగ్రెస్ సైతం ఇప్ప‌టికే త‌మ మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని శివ‌సేన‌కు ఓఫెన్ ఆఫ‌ర్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక  ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్ధానాల్లో గెలుపొంది ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 56 స్ధానాల్లో గెలుపొందగా - విపక్ష కాంగ్రెస్‌ - ఎన్సీపీలు వరుసగా 44 - 54 స్ధానాలు దక్కించుకున్నాయి.

ఇక 146 స‌భ్యుల బ‌లం ఎవ‌రికి ఉంటే వారే ఇక్క‌డ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తారు. మ‌రోవైపు శివ‌సేన మ‌ద్ద‌తు లేకుండానే బీజేపీ ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం పెట్ట‌డం.. అటు శివ‌సేన - ఎన్సీపీ - కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో అయినా ప్ర‌భుత్వ ఏర్పాటుకు రెడీ అవుతుండ‌డంతో ఫైన‌ల్‌ గా మహా రాజ‌కీయం రంజుగా మారింది.
Tags:    

Similar News