మళ్లీ అవే మాటలా దేవినేని..!

Update: 2019-08-02 11:32 GMT
'పోలవరం పై పులివెందుల పంచాయితీ..' ఇదీ నీటి పారుదల శాఖకు మాజీ మంత్రి  - తెలుగుదేశం నేత అయిన దేవినేని ఉమ చేసిన వ్యాఖ్య. పోలవరం పనుల నుంచి వైదొలగాలని కాంట్రాక్టు సంస్థ నవయుగకు ఏపీ ప్రభుత్వం తాఖీదులు ఇచ్చిన నేపథ్యంలో దేవినేని ఉమ తీవ్రంగా రియాక్ట్ అయిపోయారు. ప్రభుత్వానిది  సరైన నిర్ణయం కాదంటూ విమర్శించారు.

రాజకీయ పార్టీలు అన్నాకా విమర్శలు చేస్తూనే ఉంటాయి. అయితే తెలుగుదేశం పార్టీ తన తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాంతాన్ని లేదా ఒక ఊరిని విమర్శల మధ్యలోకి లాగడం తెలుగుదేశం పార్టీకి మంచిది కాదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలానే మాట్లాడారు.

మాటెత్తితే కడప రౌడీలు, పులివెందుల ఫ్యాక్షనిస్టులు అంటూ మొదలుపెట్టి రాయలసీమను కూడా కించపరుస్తూ తెలుగుదేశం నేతలు మాట్లాడారు. రాజకీయ విమర్శలు ఏవైనా కావొచ్చు. వాటికి ప్రతి విమర్శలు కూడా ఉంటాయి.

అయితే తెలుగుదేశం పార్టీ నేతలు ఇలా విమర్శల్లోకి ప్రాంతాలు, ఊర్ల పేర్లలోకి తీసుకొస్తూ ఉన్నారు. దీంతో సహజంగానే ఆ ప్రాంతాల్లో మరింత విసుగు తెప్పించుకుంటారు.

ఇప్పుడు 'పులివెందుల పంచాయితీ' అంటూ దేవినేని ఉమ విమర్శించారు. మరి పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ లేదా? అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి ఇటీవలి ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా. పులివెందల్లో గెలుస్తామంటూ ఇదే దేవినేని ఉమ మొన్నటి ఎన్నికలకు ముందు కూడా కేకలు వేశారు కదా. ఆఖరికి సొంత నియోజకవర్గంలో ఈయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు.

అయినా తీరు అయితే మారలేదు. ఇంకా ప్రాంతాలను, సంస్కృతిని హేళన చేసే మాటలే తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ ఉన్నారు. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లను వెనకేసుకు వచ్చేందుకు తెలుగుదేశం పార్టీ వాళ్లు మరీ ఇలా మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారి తీస్తూ ఉంది.
Tags:    

Similar News