చింత చచ్చినా పులుపు చావని దేవినేని

Update: 2019-05-28 05:54 GMT
మొన్నటివరకు ఆయన ఫైర్ బ్రాండ్.. టీడీపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి. చంద్రబాబు అనుంగ అనుచరుడు. జగన్ పై ఒంటికాలిపై లేసే నేత. జగన్ పై ఆరోపణలు చేస్తూ.. వైసీపీని ప్రశ్నిస్తూ ఉక్కిరి బిక్కిరి చేసేవారు.  జగన్ ను చిత్తుగా ఓడిస్తామని.. ఆయనే చిత్తుగా ఓడిపోయాడు. ప్రజాగెలుపును అపహాస్యం చేసేలా తాజాగా కామెంట్ చేశాడు. ఓడిన దానికి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి.. వైసీపీ గెలుపును కూడా ఎద్దేవా చేశారు. చింత చచ్చినా పులుపు చావని విధంగా దేవినేని చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కృష్ణ జిల్లాలోని గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు నివాళులర్పించారు. టీడీపీ ఓటమిని జీర్ణించుకోలేనట్టు దేవినేని మాట్లాడారు.  ఎన్టీఆర్ లాంటి మహానుభావుడే ఓడిపోయాడని.. చంద్రబాబుకు ఓటమి ఒక లెక్కా అని దేవినేని కామెంట్ చేశారు. బాబుకు గెలుపు ఓటములు కొత్తేం కాదు అంటూ సర్ధి చెప్పుకున్నాడు.

టీడీపీ దారుణ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోని దేవినేని ఏకంగా 2024లో తమదే గెలుపు అని ప్రకటించడం అందరినీ విస్మయపరిచింది. 2024 మే 28న ఇదే ఎన్టీఆర్ జయంతిని టీడీపీ విజయోత్సవంతో జరుపుకుంటామని ప్రకటించడం విశేషం. 2024 ఎన్నికలు లక్ష్యంగా ఐదేళ్లు పనిచేసి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని చెప్పుకొచ్చారు.

ఇక వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ నేతల అవినీతిని.. రాజధాని భూముల కుంభకోణాలను వెలికి తీస్తామన్న జగన్ వ్యాఖ్యలకు దేవినేని కౌంటర్ ఇచ్చారు. మేం చేపట్టిన అభివృద్ధిపై ఎవరెన్ని విచారణలు చేసినా భయపడమని.. ప్రజలు మాకు తోడుగా ఉంటారని ప్రకటించారు. ప్రజలు ఇప్పుడు వైసీపీ వెంట ఉన్నారు. అఖండ మెజార్టీతో వైసీపీని గెలిపించారు. అలాంటిది అవినీతి చేసిన నాయకుల వెంట ప్రజలు ఉంటారనడంపై అందరూ విస్తుపోయారు. ఇక ఎన్నికల్లో ఓడిపోయాక తొలిసారి దేవినేని మీడియా ముందుకు వచ్చి చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.


Tags:    

Similar News