జగన్...బై టూ గెట్ వన్ ఆఫర్

Update: 2015-06-22 07:48 GMT

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీల మధ్యే అసలు రాజకీయం నడుస్తోంది అన్న వ్యాఖ్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు తమ విమర్శలకు పదునుపెడుతున్నారు. ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ తన పంచ్ ల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ప్రత్యర్థులపై దీటైన విమర్శలు చేయడంలో దిట్టగా పేరున్న ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరోమారు జగన్ పై తనదైన శైలిలో పంచ్ వేశారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి ఏపీ సర్కారును ఇబ్బంది పెట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఉమా మండిపడ్డారు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా చేసే పనులకు జగన్ గుడ్డిగా మద్దతివ్వడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్-జగన్ మధ్య ఉన్న బంధానికి ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ అడగగానే జగన్ బహిరంగంగా మద్దతు ప్రకటించారని దేవినేని ఉమా గుర్తుచేశారు.

తెలంగాణలో వైసీపీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిస్తే కేసీఆర్‌ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఇద్దరు ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోకి తీసుకెళ్లారని ఉమా ప్రస్తావించారు. అయితే మరొక ఎమ్మెల్యే ఖాళీగా ఉండటం ఎందుకని ఆయన కూడా టీఆర్ఎస్ కే ఓటువేసేలా జగన్ అధికారికంగా ప్రకటించారని అన్నారు. 'బై టూ గెట్‌ వన్‌ ఆఫర్‌'లాగా జగన్ తన మరో ఎమ్మెల్యేను బోనస్‌గా కేసీఆర్ కు ఇచ్చారని ఎద్దేవా చేశారు.
Tags:    

Similar News