జగన్ కు కొత్త రోగాన్ని అపాదించిన దేవినేని?

Update: 2016-06-27 09:31 GMT
విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి రావటం ఈ మధ్యన నేతలకు ఒక అలవాటుగా మారింది. తాము మాట్లాడే మాటల్లో చురుకు మోతాదును రోజురోజుకి పెంచుతున్న నేతలు.. తమ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం పెరిగింది. ఏపీ అధికార.. విపక్షాల మధ్య మాటల యుద్ధం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరికి మించి మరొకరన్నట్లగా మాటల తూటాలు పేలుస్తుంటారు. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఏపీ అధికారపక్ష నేతలు తరచూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తుంటారు. చిత్రవిచిత్రమైన రోగాల్ని అంటకడుతుంటారు.

ఏపీ విపక్ష నేత జగన్ కు చిత్రమైన వ్యాధి ఉందంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యల మంట తగ్గకముందే.. మరోసారి ఆయన ఇంకో వ్యాధిని జగన్ కు అపాదిస్తూ వ్యాఖ్యలుచేశారు. సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ తో జగన్ బాధపడుతున్నారన్నారు. తమ సర్కారు మీద.. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద జగన్ మానసపుత్రికలో వస్తున్న కథనాలతో తీవ్రంగా మండిపడ్డ దేవినేని.. ఈ కొత్త వ్యాధి జగన్ కు ఉందంటూ చెప్పుకొచ్చారు.

ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న జగన్.. అదే కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడే ‘సోషల్ పర్సనాలిటీ డిజార్డర్’ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తేలిపోయిందన్నారు. జగన్ ను 420గా అభివర్ణించిన దేవినేని.. అందుకే తమ మీద కూడా 420 కేసులు పెట్టాలని జగన్ పరివారం డిమాండ్ చేస్తుందని ఫైర్ అయ్యారు. ఇంతకీ.. జగన్ కు ఉందని చెప్పే కొత్త కొత్త వ్యాధులు దేవినేని ఎలా తెలుస్తున్నట్లు..?
Tags:    

Similar News