ఫైర్ అయి బుక్ కావటం ఏమిటి ఉమా?

Update: 2016-11-07 09:42 GMT
కొంతమంది మాట్లాడే మాటలు అస్సలు అర్థం కావు. కొన్ని పదాలు విన్నంతనే బాగానే ఉంటాయి కానీ.. వాటి అర్థం ఏంది అన్న లోతుల్లోకి వెళితే అదో బ్రహ్మ పదార్థంగా కనిపిస్తుంటాయి. ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా వదిలేసిన ఏపీ అధికారపక్షానికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చేందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వెళుతున్న ఏపీ విపక్ష నేత.. అందులో భాగంగా తాజాగా విశాఖలో జై ఆంధ్రప్రదేశ్ పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం తెలిసిందే.

ప్రత్యేక హోదా సాధన కోసం సభను ఏర్పాటు చేసిన జగన్.. హోదా ఇవ్వని మోడీపై ఒక్క విమర్శ చేయకున్నా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడటం.. ఆయన విధానాల్ని.. ఆయన సర్కారు పని తీరును తిట్టిన తిట్టకుండా తిట్టిపోసిన వైనాన్ని మర్చిపోలేం. ఇదిలా ఉంటే.. విశాఖ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఏపీ మంత్రి దేవినేని ఉమా. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల్లో ఆసక్తికరంగా అనిపించిన మాటల్లో ఒకటి.. ‘‘ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున పోరాటం చేయాల్సింది పోయి.. నెలకు 20 రోజులు విశ్రాంతి తీసుకొని.. ఒక ధర్నా.. ఒక సభతో ప్రజలను మభ్య పెడుతున్నారు’’ అంటూ విరుచుకుపడ్డారు.

దేవినేని ఉమా చెప్పిన మాటలే నిజమని అనుకుందాం. ఇంతకీ.. ప్రజల కోసం.. ప్రజల తరఫు పోరాడటం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు దేవినేని వారు సమాధానం ఇస్తే బాగుంటుందేమో. ప్రత్యేక హోదా అన్నదే అవసరం లేదన్నట్లుగా మాట్లాడుతున్న ఏపీ అధికారపక్షానికి.. హోదా కావాలంటూ పెట్టే సభలు ప్రజల తరఫు పోరాడేవిగా.. ప్రజల కోసం పోరాడేవిగా కనిపించకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు.

ఇక.. దేవినేని వారు చేసిన మరో ఆసక్తికరమైన వ్యాఖ్య ఏమిటంటే.. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాడాల్సింది పోయి.. ఎంపీలతో రాజీనామా చేస్తాననటం విడ్డూరంగా ఉందని చెప్పటం. తెలంగాణ ఉద్యమాన్ని చూస్తే.. ఏ రోజున కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఢిల్లీ స్థాయిలో పోరాటాలు.. ఉద్యమాలు చేసింది లేదని చెప్పాలి. ఎంతసేపటికి ఢిల్లీలో లాబీయింగ్ చేసిన కేసీఆర్.. తన పోరాటాల్నితెలంగాణలోనే చేశారన్నది మర్చిపోకూడదు.

తన పార్టీ ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించటం.. తానుకూడా స్వయంగా రాజీనామా చేయటం ద్వారా.. సెంటిమెంట్ ను భారీగా రేపి.. నాటి అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన వైనాన్ని ఉమా మర్చిపోయినట్లు కనిపిస్తోంది. ఒకవేళ.. ఆయనకుకానీ ఈ విషయం గుర్తుండి ఉంటే.. జగన్ ను ఢిల్లీకి వెళ్లి హోదా కోసం పోరాడమని చెప్పి ఉండేవారు కాదేమో. జగన్ పెట్టిన సభకు కౌంటర్ ఇవ్వాలన్న తొందరలో ఏది పడితే అది మాట్లాడి పలుచన అయ్యే కన్నా కాస్త చూసుకొని మాట్లాడితే బాగుంటుంది కదా ఉమా అన్న భావన వ్యక్తమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News