లేఖలో సంత‌కం చేసేముంద ఓ సారి చ‌దువుకో: దేవినేని

Update: 2017-10-16 07:52 GMT
రాష్ట్రంలో రైతులు తీవ్ర అవ‌స్థ‌ల్లో ఉన్నారని పేర్కొంటూ....ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు వైసీపీ అధినేత - ఏపీ ప్రతిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాసిన లేఖ‌పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిప‌డ్డారు. జగన్‌ కు ముఖ్య‌మంత్రి పీఠంపై ధ్యాస ఉండ‌టం వ‌ల్లే...వాస్త‌వాలు - వివ‌రాలు తెలియ‌కుండానే సీఎంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు. రాష్ట్రంలోని డ్యాములన్నీ నిండుతున్నాయని - మంచి వర్షాలు పడుతున్నాయని తెలిపిన మంత్రి దేవినేని ఈ ప‌రిణామంతో రైతులంతా సంతోషంలో ఉంటే...జగన్ ఓర్వలేని తనంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని దేవినేని విమర్శించారు. ఎవరో రాసిన లేఖలపై జగన్ సంతకాలు చేస్తున్నారని - అందులో ఏం ఉందనేది కూడా చూసుకున్నట్లుగా లేదన్నారు. ముఖ్యమంత్రి పదవి అంటే చిన్న పిల్లలు ఆడుకునే ఆట కాదు అని...మంచి చేయకపోగా ప్రతిపక్షం చెడు చేస్తున్నారని దేవినేని  అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

గోదావరి తల్లిని తీసుకొచ్చి మన పంటలను కాపాడిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - తెలుగుదేశం ప్రభుత్వానిదని మంత్రి దేవినేని ఉమా చెప్పారు. వంశధార స్టేజ్ 2 ప్రాజెక్టును తాము నిర్మిస్తుంటే జగన్‌ కోర్టుల కెళ్తుండడం దురదృష్టకరమన్నారు. పొరుగు రాష్ట్రంలో ఉంటూ ఆ రాష్ట్రం ఆలోచ‌న‌ల‌కు త‌గిన‌ట్లుగా జ‌గ‌న్ అడుగులు వేస్తున్నార‌ని మంత్రి దేవినేని ఉమా మండిప‌డ్డారు. ఇది స‌రైన తీరు కాద‌నే విష‌యాన్ని గ‌మ‌నించాల‌న్నారు. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.265 కోట్లు ఇచ్చి అక్కడ 18 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామని ఈ సంద‌ర్భంగా మంత్రి ఉమ వెల్ల‌డించారు. ప్రాజెక్టులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వం కృతనిశ్చ‌యంతో సాగుతోంద‌ని అన్నారు.

వ‌రుణుడు క‌రుణించి విస్తారంగా కురుస్తున‌న వ‌ర్షాల వ‌ల్ల రైతులు - ప్ర‌జ‌ల్లో సంతోషం వెల్లివిరుస్తోంద‌ని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. తాజా వర్షాల‌తో  రాయలసీమ జలసీమగా మారిందని సంతోషం వ్య‌క్తం చేశారు. ఒకప్పుడు పట్టిసీమను ఒట్టిసీమ అని విప‌క్ష నేత జగన్ విమ‌ర్శించార‌ని పేర్కొంటూ ఇప్ప‌టివ‌ర‌కు....పట్టిసీమ నుంచి 78 టీఎంసీలు మళ్లించామని త‌ద్వారా రైతుల పంట‌లు కాపాడామ‌ని మంత్రి దేవినేని ఉమా చెప్పారు. త‌న ఆరోప‌ణ‌ల‌పై జ‌గ‌న్‌ ఇప్పుడేమంటార‌ని ప్ర‌శ్నించారు. త‌న విమ‌ర్శ త‌ప్ప‌ని చెప్పాల‌ని లేదంటే రైతులకు క్షమాపణ చెప్పాలని మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఓ విదేశీ యాత్ర - ఓ భేరీ - ఓ ఉత్తరం ఇదే జగన్ చేసే పని అని ఎద్దేవా చేసిన మంత్రి ఇలాంటి ప‌నుల బ‌దులు ప్ర‌తిప‌క్ష నేత రాష్ట్ర అభివృద్ధిలో క‌లిసి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News