తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం తొక్కిసలాట..భక్తులకు గాయాలు

Update: 2022-04-12 15:04 GMT
కలియుగ దైవం తిరుమలకు భక్తుల పోటెత్తారు. కరోనా లాక్ డౌన్ ఎత్తివేయడంతో భక్తులు స్వామి దర్శనానికి భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే శ్రీవారి సర్వదర్శన టోకెన్ల విషయంలో భక్తులు తోపులాడుకున్నారు. టోకెన్ల కోసం భక్తులు భారీగా ఎగబడడంతో తోపులాట చోటుచేసుకుంది. రెండు రోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో భక్తులు తిరుపతిలో వేచి ఉన్నారు. తిరిగి ఈరోజు సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు ఓపెన్ కావడంతో భక్తులు ఎగబడ్డారు. టోకెన్ల కోసం చిన్నపిల్లలు సైతం క్యూలైన్లో నిలుచొని ఇబ్బందులుపడ్డారు.

రెండు రోజుల అనంతరం గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు పంపిణీ చేశారు. అయితే గోవిందరాజస్వామి సత్రం వద్ద వేచి ఉన్న భక్తులతోపాటు ఈరోజు కూడా భక్తులు భారీ ఎత్తున క్యూలైన్ లోకి రావడంతో ఈ తోపులాట జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

టీటీడీ విజిలెన్స్ పోలీసులు చర్యలు చేపట్టినా.. భక్తుల తోపులాటను నిలపలేకపోయారు. ఈ తోపులాటలో కొందరు గాయపడడంతో వారికి చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. టోకెన్ ల కోసం భక్తులు బారులు తీరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకరిపై ఒకరు తోసుకోవడంతో కొందరు భక్తులకు గాయాలయ్యాయి. పిల్లలకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. క్యూలైన్లో ఉన్న కొందరు భక్తులు సొమ్మసిల్లిపడిపోయారు.

ఇక భక్తులు సర్వదర్శనం టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. టోకెన్ల పంపిణీ విషయంలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల పంపిణీలో భక్తుల తోపులాట జరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదురోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అధిక రద్దీ కారణంగానే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Tags:    

Similar News